Kelvin Kiptum Dies: అథ్లెటిక్స్ ప్రపంచంలో పెను విషాదం.. 24 ఏళ్ల వయసులోనే మారథాన్ వరల్డ్ రికార్డు వీరుడు మృత్యువాత
12 February 2024, 9:26 IST
- Kelvin Kiptum Dies: అథ్లెటిక్స్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. కెన్యాకు చెందిన మారథాన్ వరల్డ్ రికార్డు వీరుడు కెల్విన్ కిప్టమ్ ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు.
కెన్యా మారథాన్ వరల్డ్ రికార్డు హోల్డర్ కెల్విన్ కిప్టమ్ కారు ప్రమాదంలో మృత్యవాత పడ్డాడు
Kelvin Kiptum Dies: కెన్యాకు చెందిన మారథాన్ పరుగు వీరుడు కెల్విన్ కిప్టమ్ కన్నుమూశాడు. 24 ఏళ్ల వయసులోనే ఈ వరల్డ్ రికార్డు హోల్డర్ రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడటం అథ్లెటిక్స్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఈ ప్రమాదంలో అతని కోచ్ కూడా చనిపోయాడు. రిఫ్ట్ వ్యాలీలో జరిగిన ప్రమాదంలో కెల్విన్ కన్నుమూయడం తీవ్రంగా కలచివేస్తోంది.
కెల్విన్ ఎలా చనిపోయాడంటే?
మొజాంబిక్ సమీపంలోని రిఫ్ట్ వాలీలో ఆదివారం (ఫిబ్రవరి 11) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. రువాండాకు చెందిన తన కోచ్ తో కలిసి కారులో వెళ్తుండగా జరిగిన ఈ దారుణంలో కెల్విన్, అతని కోచ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారులో ఉన్న మరో వ్యక్తి షారోన్ కోస్గే తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కెల్విన్ అకాల మరణం కెన్యా మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, అథ్లెట్లు అతని మరణానికి సంతాపం తెలిపారు. కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా, ప్రస్తుతం స్పోర్ట్స్ మినిస్టర్ అబాబు నంవాంబా ఈ విషాదంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. కెల్విన్ ను దేశ నిజమైన హీరోగా వాళ్లు కీర్తించారు.
మారథాన్ హీరో కెల్విన్
కెన్యాకు చెందిన కెల్విన్ కిప్టమ్ పేరిట మారథాన్ వరల్డ్ రికార్డు ఉంది. అతడు షికాగో మారథాన్ లో పరుగును 2:00:35 లోనే పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. కెన్యాకే చెందిన అతని సహచరుడు ఇలియుడ్ కిప్చోగే (2:01:09) పేరిట ఉన్న రికార్డును కెల్విన్ తిరగరాశాడు. మారథాన్ పరుగును అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్ 7లో మూడు కెల్విన్ వే కావడం గమనార్హం.
పారిస్ ఒలింపిక్స్ తో పాటు మారథాన్ ను 2 గంటల్లోపే పూర్తి చేయాలన్న లక్ష్యాలను పెట్టుకున్న కెల్విన్.. ఇలా అర్ధంతరంగా కన్నుమూయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కెల్విన్ మరణంపై వరల్డ్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో, ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. కెల్విన్ ఓ అద్భుతమైన అథ్లెట్ అని ఈ సందర్భంగా కో అన్నాడు.
"కెల్విన్ కిప్టమ్, అతని కోచ్ గెర్వాయిస్ హకిజిమానా ఇలా మృత్యువాత పడటం మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. వరల్డ్ అథ్లెటిక్స్ తరఫున వాళ్ల కుటుంబాలు, ఫ్రెండ్స్, టీమ్మేట్స్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని సెబాస్టియన్ అన్నారు.