RCB vs MI: ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ.. బెంగళూరుపై మెరుగైన స్కోరు సాధించిన ముంబయి
02 April 2023, 21:40 IST
- RCB vs MI: చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు బౌలర్లలో తిలక్ వర్మ 2 వికెట్లు పడగొట్టాడు.
ముంబయి-ఆర్సీబీ
RCB vs MI: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ మెరుగైన స్కోరు సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ(84) అద్భుతమైన అర్ధశతకంతో తన జట్టుకు మెరుగైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో కరణ్ శర్మ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, రీసె టోప్లే, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్స బ్రాస్ వెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు శుభారంభమేమి దక్కలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను(10) సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్లోనే కామెరూన్ గ్రీన్‌ను(5) రీసే టోప్లే పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ప్రమాదకర రోహిత్ శర్మను(1) ఆకాష్ దీప్ వెనక్కి పంపాడు. దీంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో పరుగుల రావడం కష్టంగా మారింది. అయితే క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ నిలకడగా రాణించాడు. సూర్యకుమార్(15)తో కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు.
అయితే అప్పుటి వరకు నిదానంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. వేగం పెంచడానికి ప్రయత్నించగా.. బ్రాస్‌నెల్ అతడిని ఔట్ చేశాడు. దీంతో 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది ముంబయి. ఇలాంటి సమయంలో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
చివరి రెండు ఓవర్లలో ముంబయి భారీగా పరుగులు సాధించింది. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 16 పరుగులు పిండుకోగా.. 20వ ఓవర్లో రెండు సిక్సర్లు ఓ ఫోర్ సహా 22 పరుగులు లభించాయి. తిలక్ వర్మ దూకుడైన బ్యాటింగ్‌తో ముంబయి మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 46 బంతుల్లో 84 పరుగులు చేశాడు తిలక్. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివరకు ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది.