Shardul Thakur Injury: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. శార్దూల్‌కు గాయం..!
10 May 2023, 15:27 IST
- Shardul Thakur Injury: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. కేకేఆర్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
శార్దూల్ ఠాకూర్
Shardul Thakur Injury: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు వరుసగా గాయల బెదడ తలెత్తుతోంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కాగా.. ఇటీవల కేఎల్ రాహుల్ కూడా గాయం బారిన పడ్డాడు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు పెద్దగా బౌలింగ్ కూడా చేయట్లేదు. అంతేకాకుండా తనకు చిన్న గాయమైనట్లు కూడా అతడే స్వయంగా తెలియజేశాడు.
"మా జట్టులో చాలా మంది ఆల్ రౌండర్లు ఉన్నారు. ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లాంటి వారితో కలిసి 8 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో కెప్టెన్ నితీష్ రాణా కూడా 1 లేదా 2 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే వర్క్ లోడ్ లేకుండా నాకు తక్కువ ఓవర్లు బౌలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇదంతా మ్యాచ్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. నాకు బౌలింగ్ ఇవ్వాలా లేక వేరొకరి చేత బౌలింగ్ చేయించాలా అనేది కెప్టెన్ అనుకోవాలి. జట్టు వ్యూహాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంపై నేను పెద్దగా ఆందోళన చెందట్లేదు." అని శార్దూల్ అన్నాడు.
డబ్ల్యూటీసీలో ఆడటం అనుమానమే..
శార్దూల్‌కు తక్కువ ఓవర్లు బౌలింగ్ ఇవ్వడం వల్ల అతడు గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో శార్దూల్ 8 మ్యాచ్‌ల్లో 14.5 ఓవర్లే బౌలింగ్ చేశాడు. ఇదే గత సీజన్‌లో 48.3 ఓవర్లు బౌలింగ్ చేయగా.. 2021 ఎడిషన్‌లో 60 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో అతడు గాయపడిన కారణంగానే అతడికి తక్కువ ఓవర్లు బౌలింగ్ ఇస్తున్నారని, పెద్దగా వర్క్ లోడ్ పడకుండా చూస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే.. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతడు ఆడటం అనుమానంగా మారింది.
"నేను గాయపడ్డాను. ఆ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాను. కోలుకుని వచ్చిన తర్వాత బౌలింగ్ చేసేంత ఫిట్‌గా లేను. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నాకు. నాకు అవకాశమొచ్చినప్పుడు బంతితో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను." అని శార్దూల్ తెలిపాడు.
వరుస గాయాలపై మాట్లాడుతూ.. మోడర్న్ క్రికెట్‌లో ఫిట్‌గా ఉండటం ఛాలెంజ్‌తో కూడుకుని ఉంటుందని అన్నాడు. "ఫిట్‌గా ఉండటం అంత సులభం కాదు. శరీరాల వారీగా ఇంకా కష్టం. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఫీల్డింగ్, బ్యాటింగ్ చాలా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫిట్‌గా ఉండాలంటే కాస్త పరుగెత్తాలి. మొత్తం మీద ఇది అంత సులభం కాదు. మోడర్న్ క్రికెట్‌లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం సవాలే." అని అన్నాడు.