Shane watson on Rohit: ఐపీఎల్‌లో నాలుగేళ్లుగా రోహిత్ నిలకడగా ఆడట్లేదు.. వాట్సన్ షాకింగ్ కామెంట్స్
28 April 2023, 16:59 IST
- Shane watson on Rohit: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు వాట్సన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గత నాలుగైదు సీజన్లుగా హిట్ మ్యాన్ ఐపీఎల్‌లో పెద్దగా రాణించట్లేదని స్పష్టం చేశాడు.
రోహిత్ శర్మ
Shane watson on Rohit: ముంబయి ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు మినహా వరుసగా విఫలమవుతోంది. కేవలం ఆరే పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఆటతీరుపై ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. పైపెచ్చుకు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్థాయికి తగినట్లు ఆడట్లేదు. ఈ సీజన్‌లో అతడు పేలవ ప్రదర్శనతో అభిమానుల అంచనాలను తలకిందలు చేస్తున్నాడు. తాజాగా రోహిత్ ఫామ్‌పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కూడా స్పందించాడు. గత నాలుగైదు సీజన్లుగా ఐపీఎల్‌లో హిట్ మ్యాన్ నిలకడగా రాణించట్లేదని స్పష్టం చేశాడు.
“మానసిక శక్తిని మేనేజ్ చేయడం చాలా పెద్ద సవాలు. ఇంటర్నేషనల్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మ్యాచ్‌లు ఆడతారు. కానీ ఇండియన్ క్రికెటర్ల మాత్రం ఏఢాది మొత్తం నాన్ స్టాప్‌గా ఆడుతూనే ఉంటారు. టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా విరామం లేకుండా ఆడుతున్నాడు. ఈ భారం కారణంగా అతడు మానసికంగా అలసిపోతున్నాడు” అని షేన్ వాట్సన్ అన్నాడు.
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో నిలకడగా రాణించట్లేదని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. “రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఉంటుందో చూశాం. కానీ గత నాలుగైదు సీజన్లుగా ఐపీఎల్‌లో అతడు పెద్దగా రాణించలేదు. చాలా వరకు నిలకడగా ఆడట్లేదు. రోహిత్ గన్ బ్యాటర్. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లందరినీ ఆడాడు.” అని వాట్సన్ తెలిపాడు.
రోహిత్ శర్మ ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా పెద్దగా రాణించలేదు. 2017 నుంచి ఇప్పటి వరకు అతడి సగటు 30 కంటే తక్కువగానే ఉంది. ఐపీఎల్ 2023లో ఏడు మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 25.86 సగటుతో 181 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా ముంబయి ఇండియన్స్ ప్రదర్శనపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే నాలుగింటిలో ఓడి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబయి తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 30 శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.