KKR New Captain: పఠాన్ స్టైల్లో కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఎవరో తెలుసా?
27 March 2023, 18:07 IST
KKR New Captain: పఠాన్ స్టైల్లో కొత్త కెప్టెన్‌ను అనౌన్స్ చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే ఎవరూ ఊహించని రీతిలో నితీష్ రాణాను ఆ టీమ్ స్టాండిన్ కెప్టెన్ గా నియమించడం విశేషం.
నితీష్ రాణా
KKR New Captain: ఐపీఎల్ 2023 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ స్టాండిన్ కెప్టెన్ ను అనౌన్స్ చేసింది. ఆ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో మరో కెప్టెన్ ను ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆ టీమ్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణాకు కెప్టెన్సీ అప్పగించడం విశేషం.
సోమవారం (మార్చి 27) తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్టాండిన్ కెప్టెన్ విషయాన్ని ఆ టీమ్ అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని తమ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ రీసెంట్ మూవీ పఠాన్ స్టైల్లో ఓ వీడియో ద్వారా వెల్లడించడం విశేషం. "కెప్టెన్ - ఇది కేవలం ట్రైలరే.. అసలు యాక్షన్ ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది" అంటూ నితీష్ రాణాను కెప్టెన్ గా ఇంట్రడ్యూస్ చేసింది.
బ్యాక్‌గ్రౌండ్ లో పఠాన్ మూవీలోని పాపులర్ డైలాగ్స్, మ్యూజిక్ వస్తుండగా.. స్టాండిన్ కెప్టెన్ ను పార్ట్ లు పార్ట్‌లుగా చూపించింది. శ్రేయస్ అయ్యర్ తన వెన్ను గాయానికి సర్జరీ చేయించుకోవాలని అనుకోవడం అతడు కనీసం 4 నుంచి 6 నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. అయితే అతని స్థానంలో 2018 నుంచి నైట్ రైడర్స్ జట్టుతోనే ఉన్న నితీష్ రాణాకు అవకాశం ఇచ్చారు.
ఈ మేరకు కోల్‌కతా ఫ్రాంఛైజీ సోమవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఐపీఎల్ 2023లో ఏదో ఒక సమయంలో శ్రేయస్ తిరిగి వస్తాడని ఆశించిన ఆ టీమ.. లక్కీగా నితీష్ రూపంలో మంచి కెప్టెన్ దొరికాడని చెప్పింది.
"దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్సీ అనుభవం, ఐపీఎల్లో ఆడిన అనుభవం, 2018 నుంచి కేకేఆర్ జట్టుతోనే ఉన్న నితీష్ రాణా జట్టులో ఉండటం మా అదృష్టం. అతడు సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నాం. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, సపోర్ట్ స్టాఫ్ నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంటుంది" అని కేకేఆర్ స్పష్టం చేసింది.
గతంలో నితీష్ రాణా ఎప్పుడూ ఐపీఎల్లో కెప్టెన్సీ చేపట్టలేదు. కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ లో కీలకంగా ఉన్న నితీష్.. కెప్టెన్ గా ఎంతమేర సక్సెస్ అవుతాడో చూడాలి. నిజానికి విండీస్ విధ్వంసకారుడు రసెల్ కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా.. కేకేఆర్ అనూహ్యంగా నితీష్ వైపు మొగ్గు చూపింది.