Salman Butt Backed Kohli: విరాట్‌ను వెనకేసుకొచ్చిన పాక్ మాజీ.. కోహ్లీ రికార్డుల కోసం ఆడతాడనే విమర్శలపై ఫైర్
12 April 2023, 11:33 IST
- Salman Butt Backed Kohli: విరాట్ కోహ్లీని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ వెనకేసుకొచ్చాడు. కోహ్లీ రికార్డుల కోసం ఆడతాడని న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ విమర్శించడంతో అతడిపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
విరాట్ కోహ్లీ
Salman Butt Backed Kohli: విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యం, సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 61 పరుగులతో అదరగొట్టాడు. అయితే కోహ్లీ చేసిన ఈ హాఫ్ సెంచరీపై న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ విమర్శలు గుప్పించాడు. కోహ్లీ దృష్టి రికార్డులపైనే ఉందని స్పష్టం చేశాడు.
"కోహ్లీ ఇన్నింగ్స్‌ను ట్రైన్ మాదిరిగా వేగంగా ఆరంభించాడు. మొదట్లోనే చాలావరకు షాట్లు ఆడాడు. కానీ 42 నుంచి 50 పరుగుల చేయడానికి 10 బంతులు తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే రికార్డులు, మైల్‌స్టోన్లపైనే అతడి దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆటలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. వికెట్లు చేతిలో ఉన్నప్పుడు అంత నిదానంగా ఆడకూడదు. ఆ సమయంలో పరుగులు చేసుకుంటూ వెళ్లిపోవాలి." అని కోహ్లీపై సైమన్ డౌల్ విమర్శలు చేశాడు.
డౌల్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ మండిపడ్డాడు. చెత్త వాగుడు వాగుతున్నాడని తీవ్ర విమర్శలు చేశాడు.
"సైమన్ డౌల్ పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. బాబర్ ఆజంపై ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు కోహ్లీని కూడా విమర్శిస్తున్నాడు. అతడు గేమ్ స్పష్టంగా చూసినట్లయితే రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కోహ్లీ మూడు, నాలుగు భారీ షాట్లకు యత్నించాడు. కానీ అవి మిస్సయ్యాయి. ఇదంతా గేమ్‌లో భాగం. 75 అంతర్జాతీయ సెంచరీలు చేసిన కోహ్లీ ఎవరికోసమో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని సల్మాన్ బట్ అన్నాడు.
అంతటితో ఆగకుండా మైల్‌స్టోన్ల కోసం అందరూ ప్రయత్నిస్తారని సల్మాన్ బట్ గుర్తు చేశాడు. "ఈ రోజుల్లో యువకులు రికార్డుల కోసం చూస్తున్నారు. ఎందుకంటే అవి జట్టులో వారి స్థానాన్ని సుస్థిరం చేస్తాయి. అలాంటప్పుడు కోహ్లీ ఎందుకు చేయకూడదు? అతడు ఇండియన్ టీమ్‌లో చోటు కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్. తక్కువగా ఆలోచించకుండా ఉండాలి. కోహ్లీ, బాబర్, విలియమ్సన్ లాంటి వాళ్లు పవర్ హిట్టర్లు కాదు. వాళ్లు క్రికెట్‌కు వ్యాల్యూ పెంచారు. సైమన్ డౌల్ అటెన్షన్ కోసమే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది." అని సల్మాన్ బట్ స్పష్టం చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ లక్నో చివరి వరకు పోరాడి ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.