Dhoni Bowls To Dhoni: ధోనీకి ధోనినే బౌలింగ్.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సీఎస్‌కే
24 March 2023, 19:36 IST
Dhoni Bowls To Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది. ధోనీకి ధోనీనే బౌలింగ్ చేస్తున్నట్లు వీడియోను ఎడిట్ చేసి పోస్టు చేసింది.
ధోనీకి ధోనీనే బౌలింగ్
Dhoni Bowls To Dhoni: మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ వికెట్ కీపింగ్ స్కిల్స్, బ్యాటింగ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్లు చెదిరే రీతిలో వికెట్ల వెనక స్టంపౌట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుట్టిస్తాడు. అలాగే భయంకరమైన సిక్సర్లతో బౌలర్లకూ చుక్కలు చూపిస్తాడు. మైదానంలో ఈ రెండు విషయాల్లో ధోనీకి వంక పెట్టడానికి లేదు. ఇది కాకుండా మన మిస్టర్ కూల్‌లో మరో టాలెంట్ కూడా ఉంది. అదే బౌలింగ్. చాలా అరుదుగా మాత్రమే మన మహీ బౌలింగ్ చేయడం చూసుంటాం. 538 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోనీ.. మొత్తం కెరీర్‌లో కేవలం 22 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడట. అంతేకాకుండా వన్డేల్లో ఓ వికెట్ కూడా తీశాడు. ఇక ఐపీఎల్‍లో అయితే ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలే లేవు. అయితే వచ్చే ఐపీఎల్‌లో మహీ బౌలింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చెన్నైలో ఐపీఎల్ 2023 కోసం మహీ ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నాడు. ఇందులో భాగంగా తన బౌలింగ్ నైపుణ్యానికి కూడా పదును పెట్టాడు. పలు ఓవర్లు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఈ అరుదైన సంఘటనను కెమెరాలో బంధించి అద్భుతమైన వీడియోను రూపొందించింది. నెట్స్‌లో అతడు బ్యాటింగ్ చేసే వీడియోకు ఈ బౌలింగ్ క్లిప్‌కు ఎటాచ్ చేసింది. అంటే ధోనీ బౌలింగ్ చేస్తుంటే.. ధోనీనే బ్యాటింగ్ ఆడుతున్నట్లు వీడియోను ఎడిట్ చేసింది. అంతేకాకుండా ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
" ది మల్టీవర్స్ మహీ" అంటూ సామాజిక మాధ్యమాల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. "ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్ ఒకే వీడియోలో కనిపిస్తున్నారు" అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. "ఈ ఏడాది వింటేజ్ ధోనీ"ని చూడబోతున్నాం అంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. "అతడిని చూస్తుంటే 20 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు" అని ఇంకో వ్యక్తి మహీ ఫిట్నెస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ భవితవ్యంపై గత కొంతకాలంగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదే అతడికి చివరి సీజన్ అని, అందుకే చెన్నై వేదికగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఆడతాడని అంటున్నారు. అయితే ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి కచ్చితమైన వార్తలు లేవు.
అయితే మరికొంతమంది మాత్రం 41 ఏళ్ల ధోనీ ఇంక చిన్న కుర్రాడు కాదని, టీ20 లీగ్‌కు మించి ప్రొఫెషనల్ స్థాయిలో క్రికెట్ ఆడలేడని అంటున్నారు. గత సీజన్‌లో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించినప్పుడు ధోనీకి అదే చివరి ఐపీఎల్ అని భావించారు. అయితే మధ్యలోనే కెప్టెన్‌గా మహీకి తిరిగి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ సీజన్‌కు ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.