Depak Chahar on Dhoni: ఎవరూ నమ్మనప్పుడు ధోనీ నన్ను నమ్మాడు.. సీజన్ అంతా అవకాశమిచ్చాడు.. దీపక్ చాహర్ స్పష్టం
27 May 2023, 21:10 IST
- Depak Chahar on Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై సహచర చెన్నై ప్లేయర్ దీపక్ చాహర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తనను మహీ ఏ విధంగా ప్రోత్సహించాడో తెలిపాడు. తనపై నమ్మకముంచి సీజన్ అంతా ఆడించాలని తెలిపాడు.
దీపక్ చాహర్
Depak Chahar on Dhoni: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా జట్టును ముందుండి నడిపించే నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ. అతడు తన నైపుణ్యంతో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తన బెస్ట్ ఇస్తున్నాడు. ఎంతోమంది యువ ఆటగాళ్లలో నైపుణ్యాన్ని వెలికి తీసిన ఘనత మహీకే చెందుతుంది. అలా వెలికితీసిన ప్రతిభావంతుల్లో దీపక్ చాహర్ ఒకడు. మహీ తనపై ఎంత నమ్మకముంచారో తెలియజేశాడు దీపక్. అన్ని మ్యాచ్‌లను తనతో ఆడించినట్లు చెప్పాడు.
"నేను మొదటి సారి మహీ భాయ్ కలిసినప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాను. ఫ్లెమింగ్ పుణె టీమ్‌కు నన్ను సెలక్ట్ చేశారు. అయితే బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం ఎంపిక చేశారు. మొదటి రోజు మా క్యాంప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. వన్డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాను. నేను ఐదు సిక్సర్లు బాది 30 పరుగులు చేసాను. అనంతరం పరుగు కోసం ప్రయత్నించిన సమయంలో గాయపడ్డాను. నేను కోలుకునే సమయానికి టీమ్ కాంబినేషన్ సెట్ అయింది. నా స్థానంలో రజత్ భాటియా ఆడాడు. ఆ తర్వాత సంవత్సరం స్టీవ్ స్మిత్ కెప్టెన్ అయ్యాడు. నేను 12వ ఆటగాడిగా ఉన్నాను. సీజన్ మొత్తం నాకు అవకాశం వస్తుందని అన్నారు.. కానీ రాలేదు. కొద్దిగా నిరాశ చెందాను" అని దీపక్ చాహర్ వెల్లడించాడు.
"ఆ తర్వాత ఏడాది వేలంలో సీఎస్‌కే తరఫున నన్ను ఎంచుకున్నారు. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత నన్ను ఆడించాలని ఫ్లెమింగ్ అనుకున్నారు. బదులుగా నా స్థానంలో సీనియర్ తీసుకోవాలనుకున్నారు. కానీ మహీ భాయ్ మాత్రం ఏదేమైనా నన్ను 14 మ్యాచ్‌లు ఆడించాల్సిందేనని ఫ్లేమింగ్‌తో అన్నారు. మిగిలినవి ఏమైనా ఉంటే చూసుకోమని తెలిపారు. దీంతో నేను ఆ సీజన్‌లో ఆడాను" అని దీపక్ చాహర్ తెలిపారు.
30 ఏళ్ల దీపక్ చాహర్.. 2018 ఐపీఎల్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఆడాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 17.28 ఎకానమీ రేటుతో 10 వికెట్లు తీశాడు. అలాగే 39 బంతులు ఎదుర్కొని 50 పరుగులు చేశాడు.