తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Fitness Update On Shami: బుమ్రా స్థానంలో షమీ ఎంపికపై రోహిత్ స్పందన.. ఫిట్నెస్‌పై అప్డేట్

Rohit Fitness update on Shami: బుమ్రా స్థానంలో షమీ ఎంపికపై రోహిత్ స్పందన.. ఫిట్నెస్‌పై అప్డేట్

15 October 2022, 9:54 IST

google News
    • Rohit Fitness update on Shami: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా జట్టుకు దూరమైన షమీ ఫిట్నెస్‌పై రోహిత్ శర్మ స్పందించాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (ANI)

రోహిత్ శర్మ

Rohit Fitness update on Shami: టీ20 వరల్డ్ కప్ 2022 కోసం రంగం సిద్ధమైంది. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ పొట్టి సమరం కోసం ఇప్పటికే జట్లన్నీ అక్కడకు చేరుకున్నాయి. టీమిండియా కూడా వారం ముందే అక్కడకు చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ శ్రీలంక-నమీబియా మధ్య జరగనుంది. సూపర్ 4 స్టేజ్ అక్టోబరు 22 నుంచి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కంటే ముందు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది. గత ఏడాది జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యోచిస్తోంది. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ గేమ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

"పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతిసారి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఒత్తిడి పెంచుకునేందుకు ఇక్కడ ఎలాంటి పాయింట్ లేదు. ఎప్పుడు పాక్ ఆటగాళ్లను కలిసినా.. వారు ఎలా ఉన్నారు? వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఏ కారు కొన్నారు? లాంటి సాధారణ చర్చలే జరుగుతాయి. అంతేకానీ మ్యాచ్ గురించి హైరానా పడటం ఉండదు" అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని తీసుకోవడంపై రోహిత్ మాట్లాడుతూ.. "ఆటలో గాయాలు సహజమే. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. మీరు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటే.. గాయాలు తరచూ వస్తూనే ఉంటాయి. అందుకే గత ఏడాది కాలంగా రిజర్వ బెంచ్‌ను బలంగా చేసే పనిలో పడ్డాం. అవకాశమొచ్చినప్పుడల్లా యువకులకు ఛాన్స్ ఇస్తున్నాం. షమీ విషయానికొస్తే.. అతడు కోవిడ్ బారిన పడి 2, 3 వారాలు ఆటకు దూరంగా ఉన్నాడు. అనంతరం ఎన్‌సీఏకు వెళ్లి చికిత్స పొంది కోలుకున్నాడు. బ్రిస్బేన్ మైదానంలో ఆదివారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు హాజరవుతాడు.పాక్‌తో మ్యాచ్ కంటే ముందు అతడికి 3 నుంచి 4 బౌలింగ్ సెషన్లు ఉంటాయి. మంచి బౌలర్ కాబట్టి అతడు మెరుగ్గా పునరాగనమనం చేస్తాడు." అని హిట్ మ్యాన్ అన్నాడు.

బుమ్రా గాయం బారిన పడటంపై స్పందిస్తూ.. "అతడు చాలా నాణ్యమైన బౌలర్. దురదృష్టవశాత్తూ గాయాలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఏం చేయలేం. మేము చాలా మంది స్పెషలిస్టులతో అతడి గాయం గురించి చర్చించాం. అతడు తిరిగి వస్తాడేమోనని చూశాం. వరల్డ్ కప్ ముఖ్యమే.. కానీ బుమ్రా కెరీర్ అంతకంటే ముఖ్యం. అతడి వయస్సు 27, 28 సంవత్సరాలే. ఇంకా ఎంతో ఉత్తమ కెరీర్ ముందుంది. అందుకే ఈ సమయంలో అతడి కెరీర్‌ను రిస్కులో పెట్టదలచుకోలేదు. నిపుణులు కూడా అతడు ఆడకపోవడమే ఉత్తమమని సలహా ఇచ్చారు.ఠ అని రోహిత్ శర్మ తెలిపాడు.

సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. మిడిలార్డర్‌లో కీలకమైన ఆటగాడు. తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఎంతో నిర్భయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టులో మాకు కీలకమైన ఆటగాడు. వరల్డ్ కప్‌లోనూ ఇదే ఫామ్ కొనసాగిస్తాడని భావిస్తున్నా." అని సుూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమిండియా గ్రూప్-2లో పోటీ పడుతోంది. ఈ గ్రూపులో పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, సూపర్-12లో క్వాలిఫై అయిన రెండు ఇతర జట్లు ఉంటాయి. అక్టోబరు 23న పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్ వేదికగా తలపడనుంది టీమిండియా.

తదుపరి వ్యాసం