Aakash Chopra About Shami Selection: షమీ ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?-aakash chopra says about mohammad shami t20 world cup selection ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Aakash Chopra Says About Mohammad Shami T20 World Cup Selection

Aakash Chopra About Shami Selection: షమీ ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Maragani Govardhan HT Telugu
Oct 14, 2022 10:15 PM IST

Aakash Chopra About Shami Selection: షమీని జట్టులో తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. షమీ 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 కూడా ఆడలేదని తెలిపాడు.

మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ (PTI)

Aakash Chopra About Shami Selection: టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో పేసర్ మహమ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. పొట్టి ప్రపంచకప్ కోసం బుమ్రా స్థానంలో షమీని తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న షమీని.. జట్టులోకి తీసుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ.

ట్రెండింగ్ వార్తలు

బీసీసీఐ తాజా ప్రకటనతో షమీ, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌తో టీమిండియా పేస్ దళం ప్రపంచకప్‌లో పోటీ పడుతోంది. దీంతో బీసీసీఐ మాజీ సెలక్టర్లు దిలీప్ వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు షమీని జట్టులో తీసుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించారు. షమీ 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 కూడా ఆడలేదని తెలిపాడు.

“బుమ్రా స్థానంలో షమీ వచ్చాడు. ఇక్కడ వరకు అంతా అర్థవంతంగానే ఉంది. అతడు గత ప్రపంచకప్ నుంచి ఒక్క టీ20 కూడా ఆడలేదన్నది అర్థం కావట్లేదు. అతడి ఫిట్‌నెస్‌తో సంబంధం లేదు. అతడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు.” అని ఆకాశ్ చోప్రా తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు.

యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో షమీ చివరిసారిగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆరు టీ20ల్లో ఆడాల్సి ఉంది. కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలడంతో అతడు ఆడలేకపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ షమీ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి వచ్చింది. షమీ 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.

WhatsApp channel

సంబంధిత కథనం