Shami replaced bumrah: బుమ్రా స్థానంలో షమి.. ఖరారు చేసిన ఇండియన్ టీమ్
Shami replaced bumrah: బుమ్రా స్థానంలో షమిని తీసుకుంటున్నట్లు ఇండియన్ టీమ్ వెల్లడించింది. తాజాగా 15 మంది సభ్యుల టీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
Shami replaced bumrah: ఊహించినట్లే స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో సీనియర్ బౌలర్ మహ్మద్ షమికి అవకాశం ఇచ్చింది ఇండియన్ టీమ్. ఈ విషయాన్ని శుక్రవారం (అక్టోబర్ 14) అధికారికంగా ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోయే తమ తుది 15 మంది సభ్యుల టీమ్‌ను ఖరారు చేశారు. రిజర్వ్ ప్లేయర్‌గా ఆస్ట్రేలియా వెళ్లిన షమి ఇప్పుడు 15 మంది సభ్యుల టీమ్‌లోకి వచ్చాడు.
షమి కూడా కొవిడ్ బారిన పడి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడు ఈ మధ్యే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిట్‌నెస్ నిరూపించుకొని ఆస్ట్రేలియా ఫ్లైటెక్కాడు. గతేడాది వరల్డ్ కప్ తర్వాత ఇండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని షమి.. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్ టీమ్‌లోకి రావడం విశేషం.
నిజానికి బుమ్రా స్థానంలో దీపక్ చహర్‌ను కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడు కూడా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో షమి టీమ్‌లోకి రావడం ఖాయమని అప్పుడే స్పష్టమైంది. ఇండియా తరఫున టీ20లు ఆడకపోయినా.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ విజయాల్లో షమి కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అతడు 16 మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియా కండిషన్స్‌లో షమి అనుభవం కూడా ఇండియన్ టీమ్‌కు కలిసి రానుంది. షమి ఇప్పుడు 15 మంది టీమ్‌లోకి రావడంతో రిజర్వ్ ప్లేయర్స్‌గా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ ఉండనున్నారు. వీళ్లంతా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న టీమ్‌తో కలిశారు.
టీ20 వరల్డ్‌కప్‌కు 15 మంది సభ్యుల టీమ్ ఇదే
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమి.
రిజర్వ్ ప్లేయర్స్: మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్