తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sl 2nd T20i: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్.. సిరీస్‌పై టీమిండియా కన్ను

Ind vs SL 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బ్యాటింగ్.. సిరీస్‌పై టీమిండియా కన్ను

05 January 2023, 18:35 IST

google News
    • Ind vs SL 2nd T20I: పుణె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే భారత్ సిరీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది.
భారత్-శ్రీలంక
భారత్-శ్రీలంక

భారత్-శ్రీలంక

Ind vs SL 2nd T20I: శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకోవాలని చూస్తోంది భారత్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకోవాలని యోచిస్తోంది. మరోపక్క ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో చివరి వరకు పోరాడి అనూహ్యంగా పరాజయం చవిచూసిన శ్రీలంక జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.

ఈ మ్యాచ్‌కు మోకాలి గాయంతో సంజూ శాంసన్ దూరం కాగా.. అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం కల్పించింది జట్టు యాజమాన్యం. గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన రాహుల్ త్రిపాఠి.. 413 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని జాతీయ జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ రానున్నారు. గత మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో ఈ గేమ్‌లోనైనా పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే హర్షల్ పటేల్ ఇబ్బంది పడుతున్నాడు. ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నాడు. తొలి టీ20కి అర్ష‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయగా.. ఈ సారైనా ఆడిస్తారో లేదో చూడాలి. ఇక యువ సంచలనాలు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పిన్నర్ల విషయానికొస్తే యజువేంద్ర చాహల్ పెద్దగా ప్రభావం చూపలేదు. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ మాత్రం తీయలేదు.

మరోపక్క శ్రీలంక బౌలింగ్ విభాగం బలంగా ఉంది. గత మ్యాచ్‌లో కసున్ రజితా, హసరంగా తమ స్పెల్‌తో ఆకట్టుకున్నారు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ భానుక రాజపక్స ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ బ్యాటర్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోవట్లేదు.

తుది జట్లు..

భారత్..

ఇషాన్ కిషన్, శభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, యజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.

శ్రీలంక..

పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, అసలంక, భానుక రాజపక్స, దసున్ శనకా(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుశంకా

తదుపరి వ్యాసం