India SAFF Championship: తొమ్మిదోసారి.. కువైట్‌ను చిత్తు చేసి శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ఇండియా
05 July 2023, 7:42 IST
- India SAFF Championship: తొమ్మిదోసారి.. కువైట్‌ను చిత్తు చేసి శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది ఇండియా. మంగళవారం (జులై 4) జరిగిన ఫైనల్లో పెనాల్టీల్లో ఇండియా విజయం సాధించడం విశేషం.
ఇండియా గెలుపు సంబరం
India SAFF Championship: నరాలు తెగే ఉత్కంఠ మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన శాఫ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కువైట్ ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది ఇండియా. గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు అద్భుతమైన సేవ్, కాస్త లక్ ఇండియాకు టైటిల్ సాధించి పెట్టాయి. రెగ్యులర్ ఆట ముగిసే సమయానికి 1-1తో స్కోరు సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ లో ఇండియా 6-5తో గెలిచింది.
సెమీఫైనల్లో లెబనన్ తో అద్భుతమైన గోల్ కీపింగ్ తో ఓ గోల్ ఆపిన గురుప్రీత్ సింగ్.. ఫైనల్లోనూ దానిని రిపీట్ చేశాడు. ఈ విజయం సాధించగానే ప్లేయర్స్ అందరూ కలిసి కోచ్ ఇగోర్ స్టిమాక్ ను గాల్లోకి ఎగరేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది ఇండియా సాధించిన మూడో ట్రోఫీ కావడం విశేషం. ఈ ఏడాది ఈ శాఫ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనే ఇండియా 0-1 గోల్ తో వెనుకబడింది.
14వ నిమిషంలోనే కువైట్ తొలి గోల్ సాధించింది. అబ్దుల్లా అల్ బులౌషి ఆ గోల్ చేశాడు. ఆ తర్వాతి నిమిషంలోనే ఇండియా గోల్ సమం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఫలితం లేకపోయింది. కానీ 38వ నిమిషంలో ఛాంగ్టే చేసిన గోల్ తో స్కోరు సమమైంది. ఇక ఆ తర్వాత మరో గోల్ నమోదు కాలేదు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.
సెకండాఫ్ లో 62వ నిమిషంలో ఇండియాకు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక చివర్లో ఇండియా గోల్ గురుప్రీత్ ఓ అద్భుతమైన సేవ్ తో జట్టును ఓటమి నుంచి రక్షించాడు. మ్యాచ్ అదనపు సమయంలోనూ మరో గోల్ నమోదు చేయడంలో రెండు జట్లు విఫలమయ్యాయి. 120వ నిమిషంలోనూ స్కోరు 1-1తోనే ఉంది.
దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. తొలి కిక్ ఛెత్రీ గోల్ గా మలిచాడు. ఆ తర్వాత కువైట్ ప్లేయర్ అబ్దుల్లా ఫెయిలయ్యాడు. దీంతో ఇండియా 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత సందేశ్ ఝింగన్ కూడా గోల్ కీపర్ ను బోల్తా కొట్టించగా.. కువైట్ కు చెందిన ఫవజ్ కూడా గోల్ చేశాడు. దీంతో 2-1 ఆధిక్యంలో ఇండియా కొనసాగింది.
ఆ తర్వాత స్కోరు 3-2, 3-3, 4-4తో సమమైంది. చివరి కిక్ లో ఇండియా ప్లేయర్ మహేష్ సింగ్ సక్సెస్ కాగా.. కువైట్ ప్లేయర్ ఖాలిద్ కొట్టిన కిక్ ను గోల్ కీపర్ గురుప్రీత్ అడ్డుకోవడంతో ఇండియా విజయం సాధించింది. మొత్తంగా 6-5 గోల్స్ తో ఇండియా గెలిచింది. ఇండియా గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో నూ శాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన విషయం తెలిసిందే.