SAFF Championship: సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్.. ఫైనల్‍కు చేరిక-india beat lebanon in penalty shootout to enter saff championship final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Saff Championship: సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్.. ఫైనల్‍కు చేరిక

SAFF Championship: సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్.. ఫైనల్‍కు చేరిక

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 02, 2023 12:16 AM IST

SAFF Championship - Team India: ఎస్‍ఏఎఫ్ఎఫ్ సెమీ ఫైనల్‍లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. లెబనాన్‍పై గెలిచి టోర్నీ ఫైనల్ చేరింది.

SAFF Championship: సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్
SAFF Championship: సెమీస్‍లో టీమిండియా ఉత్కంఠ గెలుపు.. పెనాల్టీ షూటౌట్‍లో అదుర్స్ (PTI)

SAFF Championship - Team India: సౌత్ ఏషియన్ ఫుట్‍బాల్ ఫెడరేషన్ (SAFF) చాంపియన్‍షిప్ టోర్నీలో భారత ఫుట్‍బాల్ టీమ్ మరోసారి సత్తాచాటింది. నేడు (జూలై 1) లెబనాన్‍తో జరిగిన సెమీఫైనల్‍లో పెనాల్టీ షూటౌట్ ద్వారా టీమిండియా 4-2తో విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరికి పెనాల్టీ షూటౌట్‍లో భారత్ గెలిచింది. పెనాల్టీ షూటౌట్‍లో భారత్ తరఫున కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్.. బంతిని గోల్ పోస్టులోకి కొట్టి గోల్స్ చేశారు. లెబనాన్ నాలుగు ప్రయత్నాల్లో రెండుగోల్స్ మాత్రమే చేయగలిగింది. అంతకు ముందు రెండు జట్లు మ్యాచ్ సమయంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో (0-0) పెనాల్టీ షూటౌట్ అవసరమైంది. ఈ షూటౌట్‍లో భారత్ గెలిచింది. ఇక ఎస్ఏఎఫ్ఎఫ్ ఫైనల్‍లో జూలై 4న కువైట్‍తో టైటిల్ కోసం పోరాడనుంది భారత జట్టు.

సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభంలో 10 నిమిషాల పాటు భారత్ జట్టు కాస్త వెనుకంజలో కనిపించింది. లెబనాన్ దూకుడు ప్రదర్శించింది. అయితే, లెబనాన్ గోల్ ప్రయత్నాలను టీమిండియా ఆపగలిగింది. అయితే, ఆ తర్వాత భారత్ కూడా గోల్ కోసం దూకుడు పెంచింది. 16వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ గోల్ లేకుండా 0-0తో ముగిసింది.

రెండో హాఫ్‍లోనూ భారత్, లెబనాన్ మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోరు సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 42వ నిమిషంలో లెబనాన్ కెప్టెన్ హసన్ కొట్టిన బంతిని గోల్ వెళ్లకుండా భారత గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా ఆపాడు. ఇక చివరి వరకు ఏ టీమ్ కూడా గోల్ చేయలేకపోయింది. ఎక్స్‌ట్రా టైమ్‍లోనూ రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో 0-0తో నిలిచింది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ జరిగింది. ఈ పెనాల్టీ షూటౌట్‍లో భారత్ వరుసగా నాలుగుసార్లు స్కోర్ చేసింది. లెబనాన్‍ నాలుగు ప్రయత్నాల్లో రెండుసార్లే స్కోర్ చేసింది. దీంతో పెనాల్టీ షూటౌట్‍లో 4-2 తేడాతో టీమిండియా విజయం సాధించింది.

ఎస్‍ఏఎఫ్ఎఫ్ చాంపియన్‍షిప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మొత్తంగా 13వసారి కాగా.. వరుసగా తొమ్మిదోసారి. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఎస్‍ఏఎఫ్ఎఫ్ చాంపియన్‍షిప్ టైటిల్‍ను భారత ఫుట్‍బాల్ జట్టు కైవసం చేసుకుంది. జూలై 4న కువైట్‍తో జరిగే ఫైనల్‍లో గెలిస్తే తొమ్మిదోసారి ఎస్‍ఏఎఫ్ఎఫ్ టైటిల్‍ను దక్కించుకుంది.

Whats_app_banner