తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Women's Team Coach: హెడ్‌ కోచ్‌ రమేష్‌ పొవార్‌ ట్రాన్స్‌ఫర్‌.. బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌

India Women's Team Coach: హెడ్‌ కోచ్‌ రమేష్‌ పొవార్‌ ట్రాన్స్‌ఫర్‌.. బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌

Hari Prasad S HT Telugu

06 December 2022, 16:40 IST

google News
    • India Women's Team Coach: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ రమేష్‌ పొవార్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. ఇక కొత్త బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ హృషికేష్‌ కనిత్కర్‌ నియమితుడయ్యాడు.
రమేష్ పొవార్, హృషికేష్ కనిత్కర్
రమేష్ పొవార్, హృషికేష్ కనిత్కర్

రమేష్ పొవార్, హృషికేష్ కనిత్కర్

India Women's Team Coach: ఇన్నాళ్లూ ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌లో కనిపించాడు. బీసీసీఐ అతన్ని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి పంపించింది. అక్కడ స్పిన్‌ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌తో రమేష్ పొవార్‌ చేరనున్నాడు.

ఇక ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ హృషికేష్‌ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. టీ20 వరల్డ్‌కప్‌కు రెండు నెలల ముందు బోర్డు ఈ కీలక మార్పులు చేయడం గమనార్హం. అయితే కొత్త హెడ్‌ కోచ్‌ ఎవరు అన్నది మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇక డిసెంబర్‌ 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు కూడా హెడ్‌ కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నదానిపై స్పష్టత లేదు.

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫిబ్రవరి 10 నుంచి సౌతాఫ్రికాలో జరగనుంది. గతంలో ఒకసారి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించి రాజీనామా చేసిన రమేష్ పొవార్‌.. 2021, మే నుంచి మళ్లీ ఆ పదవిలో కొనసాగుతున్నాడు. రెండేళ్ల పాటు అతడు కొనసాగాల్సి ఉంది. అంటే టీ20 వరల్డ్‌కప్‌ ముగిసే వరకూ పొవారే హెడ్‌ కోచ్‌గా ఉండాల్సి ఉన్నా.. బీసీసీఐ హఠాత్తుగా అతన్ని ఎన్సీఏకు పంపించింది.

రమేష్‌ పొవార్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్‌ చేరింది. ఆసియాకప్‌లో విజయం సాధించింది. తన కొత్త రోల్‌పై పొవార్ స్పందించాడు. "సీనియర్‌ వుమెన్స్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ పదవి నాకో మంచి అనుభవం. కొన్నేళ్లుగా కొందరు స్టార్‌ ప్లేయర్స్‌తోపాటు యువ క్రికెటర్లతోనే పని చేసే అవకాశం నాకు దక్కింది. ఇక ఇప్పుడు ఎన్సీఏలో కొత్త పదవి వచ్చింది. నా అనుభవంతో భవిష్యత్తు స్టార్లను తయారు చేస్తాను. వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పాడు.

అటు వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌ను నియమించారు. ఈ మధ్య న్యూజిలాండ్‌ టూర్‌లో మెన్స్‌ టీమ్‌ స్టాండిన్‌ కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌తో కలిసి అతడు పని చేశాడు. ఈ కొత్త రోల్‌పై కనిత్కర్‌ స్పందిస్తూ.. "సీనియర్‌ వుమెన్స్‌ టీమ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా అపాయింట్ కావడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఈ టీమ్‌లో మంచి అనుభవం ఉన్న ప్లేయర్స్‌తోపాటు యువత కూడా ఉన్నారు. సవాళ్లకు ఈ టీమ్‌ సిద్ధంగా ఉంది" అని అన్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం