Womens Asia Cup T20 2022: యూఏఈపై భారత్ ఘన విజయం.. అగ్రస్థానానికి దూసుకెళ్లిన అమ్మాయిలు
04 October 2022, 17:18 IST
- IndiaW vs UAEW: మహిళల ఆసియా కప్‌లో భాగంగా యూఏఈపై భారత అమ్మాయిలు ఘనవిజయం సాధించారు. 104 పరుగులు భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపారు.
యూఏఈపై భారత అమ్మాయిల ఘనవిజయం
India women vs UAE Women: మహిళల ఆసియా కప్ టీ20లో భాగంగా భారత అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లారు. తాజాగా యూఏఈ మహిళల జట్టుపై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లోనూ విజృంభించింది. సిల్హైట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక యూఏఈ 4 వికెట్ల నష్టానికి 74 పరుగులతోనే సరిపెట్టుకుంది. పొదుపుగా బౌలింగ్ చేసిన భారత అమ్మాయిలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లతో ఆకట్టుకోగా.. హేమలత ఓ వికెట్ తన ఖాతాలో వేసుకుంది.
యూఏఈ బ్యాటింగ్ ఆద్యంత నీరసంగా, నిదానంగా సాగింది. ఆరంభంలోనే ఓపెనర్లు తీర్థ సతీశ్, ఇషా రోహిత్ వికెట్లను కోల్పోయిన యూఏఈ జట్టు అనంతరం చాలా నిదానంగా ఆడింది. టీ20 క్రికెట్‌ను టెస్టు మాదిరిగా ఆడిందంటే భారత బౌలర్ల ఏ విధంగా ఇబ్బంది యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు. 5 పరుగులకే 3 వికెట్లను కోల్పోవడంతో వన్డౌన్ బ్యాటర్‌గా వచ్చిన కవిషా నిలకడగా ఆడింది. లక్ష్య ఛేదనను మర్చిపోయి.. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా యూఏఈ బ్యాటర్లు తమ ఆటతీరును ప్రదర్శించారు.
కవిషా-ఖుషి శర్మ వీరిద్దరూ వికెట్ పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్ ఆద్యంతం నిలకడగా ఆడారు. కవిషా 54 బంతుల్లో 30 పరుగులు చేయగా.. ఖుషి శర్మ 50 బంతుల్లో 29 పరుగులు చేసిందంటే వీరి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరే అత్యధిక పరుగులు నమోదు చేశారు. చివర్లో ఖుషి శర్మ అవుట్ కావడంతో ఛాయ ముగల్‌తో కలిసి బ్యాటింగ్ బాధ్యత తీసుకుంది. కవిషా. చివర్లోనూ వేగంగా ఆడే ప్రయత్నం చేయలేకపోయారు యూఏఈ అమ్మాయిలు. మరోపక్క భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో యూఏఈ 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమ చేయగలిగింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు 178 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్లు మేఘన, రిచా ఘోష్ వెంటనే అవుటైనప్పటికీ వన్డౌన్ బ్యాటర్ దీప్తి శర్మతో కలిసి సీనియర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది. వీరిద్దరూ అర్ధశతకాలు నమోదు చేశారు. దీప్తి 49 బంతుల్లో 64 పరుగులు చేయగా.. 45 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం సృష్టించింది రోడ్రిగ్స్. యూఏఈ బౌలర్లలో ఛాయ ముఘల్, మహికా గౌర్, ఇషా రోహిత్ తలో వికెట్‌తో ఆకట్టుకున్నారు. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.