India Women vs Ireland Women: ఐర్లాండ్‌పై విజయం.. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇండియా
20 February 2023, 22:04 IST
- India Women vs Ireland Women: ఐర్లాండ్‌పై గెలిచిన ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సోమవారం (ఫిబ్రవరి 20) జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన ఇండియన్ వుమెన్స్ టీమ్
India Women vs Ireland Women: మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది ఇండియన్ టీమ్. సోమవారం (ఫిబ్రవరి 20) ఐర్లాండ్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో డక్‌వర్త్ లూయిస్ మెథడ్ లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.
2018, 2020లలోనూ ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్ లోకి ఇండియన్ టీమ్ అడుగుపెట్టింది. 2020లో రన్నరప్ గా నిలిచింది. ఇక ఈసారి సెమీస్ చేరాలంటే ఐర్లాండ్ పై కచ్చితంగా గెలవాల్సి ఉండగా.. వరుణుడు కూడా కలిసొచ్చాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది.
దీంతో మళ్లీ మ్యాచ్ సాధ్యం కాలేదు. అయితే అప్పటికి ఐర్లాండ్ డీఎల్ఎస్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉంది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో అదే 5 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా 87 పరుగులు చేసి టీమ్ కు మంచి స్కోరు సాధించి పెట్టింది.
మరో ఓపెనర్ షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13 పరుగులు చేశారు. చివర్లో జెమీమా 12 బంతుల్లో 19 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ లో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గాబీ లూయిస్, కెప్టెన్ లారా డెలానీ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించి ఐర్లాండ్ ను మళ్లీ గాడిలో పడేశారు. ఆ టీమ్ ను మెల్లగా విజయం వైపు తీసుకెళ్తున్న సమయంలో వర్షం కురవడం ఇండియాకు కలిసొచ్చింది.