Harmanpreet world record: టీ20ల్లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Harmanpreet world record: టీ20ల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మెన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసింది ఇండియన్ వుమెన్స్ టీమ్ కెప్టెన్.
Harmanpreet world record: టీ20 క్రికెట్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డుతో హిస్టరీ క్రియేట్ చేసింది ఇండియన్ వుమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. సోమవారం (ఫిబ్రవరి 20) టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో హర్మన్ ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలో 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా ఆమె నిలిచింది.
అటు పురుషుల, ఇటు మహిళల క్రికెట్ లో ఇప్పటి వరకూ మరెవరెకీ సాధ్యం కాని రికార్డు ఇది. ఈ క్రమంలో మెన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టింది. రోహిత్ 148 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. అతడు 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక మహిళల క్రికెట్ లో హర్మన్ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్ 143 మ్యాచ్ లతో రెండోస్థానంలో ఉంది.
ఇక మరో ఇండియన్ ప్లేయర్, వైస్ కెప్టెన్ అయిన స్మృతి మంధానా 115 మ్యాచ్ లతో మూడోస్థానంలో ఉంది. వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో మ్యాచ్ లో రోహిత్ పేరిట ఉన్న రికార్డును హర్మన్ సమం చేసింది. ఇప్పుడతన్ని మించిపోయి 150 మ్యాచ్ లతో హిస్టరీ క్రియేట్ చేసింది. అంతేకాదు టీ20లలో రోహిత్, విరాట్ కోహ్లిల తర్వాత 3 వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ ప్లేయర్ గా కూడా హర్మన్ నిలవడం విశేషం.
ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఆమె 13 పరుగులు చేసింది. మహిళల క్రికెట్ లో 3 వేల టీ20 పరుగులు సాధించిన నాలుగో ప్లేయర్ గా, తొలి ఇండియన్ గా హర్మన్ రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు మ్యాచ్ ఆడిన సందర్భంగా బీసీసీఐ, ఐసీసీలకు హర్మన్ థ్యాంక్స్ చెప్పింది. ఇది తనకెంతో విలువైనదని, తన టీమ్ మేట్స్ నుంచి తాను ఎమోషనల్ మెసేజ్ అందుకున్నట్లు తెలిపింది.