India vs Bangladesh Test Series: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కూ జడేజా, షమి దూరం.. ఆ నలుగురూ వస్తారా?
09 December 2022, 11:06 IST
- India vs Bangladesh Test Series: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కూ జడేజా, షమి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి నలుగురు ప్లేయర్స్ ఇప్పుడున్న టీమ్‌లోని వారిని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
షమి స్థానాన్ని భర్తీ చేసే రేసులో ఉమ్రాన్, సైనీ, ముకేశ్
India vs Bangladesh Test Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్, దీపక్ చహర్, కుల్దీప్ సేన్‌లు గాయాలతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమి కూడా టెస్ట్ సిరీస్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
రోహిత్, చహర్, కుల్దీప్‌లు ఇప్పటికే మూడో వన్డే ఆడటం లేదు. ఇండియాకు వచ్చేసిన రోహిత్.. టెస్ట్ సిరీస్‌కు తిరిగి వేళ్లేది అనుమానమే. అతడు తిరిగి వెళ్లకపోతే టెస్టుల్లో రాహుల్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఇప్పుడీ ప్లేయర్స్ స్థానాలను భర్తీ చేయడం బీసీసీఐకి సవాలుగా మారింది. నిజానికి జడేజా, షమి కూడా టెస్టులతోపాటు వన్డేలకూ ఎంపికయ్యారు.
కానీ ఇండియన్ టీమ్ న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడే జడేజా ఆడబోవడం లేదని తేలడంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను బంగ్లాదేశ్‌కు పంపించారు. ఇక తొలి వన్డేకు రెండు రోజుల ముందు షమి భుజం గాయం కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ ఇద్దరూ టెస్ట్ సిరీస్ కూడా ఆడరని బీసీసీఐ ప్రస్తుతానికైతే అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఈ ఇద్దరూ బంగ్లాదేశ్‌కు వెళ్లడం లేదని, తమ ఫిట్‌నెస్ మెరుగుపరచుకునేందుకు నేషనల్ క్రికెట్ అకాడెమీకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బుమ్రా కూడా లేకపోవడం, ఇప్పుడు షమి, జడేజా కూడా రాకపోతే ఇండియా బౌలింగ్ మరింత బలహీనమవుతుంది. ఇక ఇప్పుడు భారమంతా ఉమేష్, అశ్విన్, సిరాజ్‌లపై పడనుంది.
షమి స్థానంలో ఎవరు?
షమి అందుబాటులో లేకపోతే అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది చూడాలి. ఉమ్రాన్ మాలిక్, నవ్‌దీప్ సైనీ, ముకేశ్ కుమార్ రేసులో ఉన్నారు. వన్డేల్లో రాణించిన ఉమ్రాన్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని స్పీడు ప్లస్ పాయింట్. అయితే అటు బంగ్లాదేశ్ ఎ టీమ్‌తో రెండు అనధికార టెస్టులు ఆడిన ఇండియా ఎ టీమ్‌లో సభ్యులైన సైనీ, ముకేశ్ కూడా తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.
జడేజా స్థానంలో యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ రేసులో ఉన్నా.. అతనికి ఛాన్స్ దక్కడం అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే టీమ్‌లో జడేజాలాంటి ఆల్‌రౌండరే అయిన అక్షర్ పటేల్ ఉన్నాడు. కుల్దీప్ మరో స్పిన్నర్ పాత్ర పోషించనున్నాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడే టీమిండియా: రోహిత్ శర్మ (అనుమానం), రాహుల్, శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్, శ్రేయస్, పంత్, కేఎస్ భరత్, అశ్విన్, జడేజా (అనుమానం), అక్షర్ పటేల్, కుల్దీప్, శార్దూల్, షమి (అనుమానం), సిరాజ్, ఉమేష్ యాదవ్.