తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri: ఐపీఎల్ ముఖ్యమా.. టీమిండియానా!: ప్లేయర్లకు రవిశాస్త్రి ప్రశ్న

Ravi Shastri: ఐపీఎల్ ముఖ్యమా.. టీమిండియానా!: ప్లేయర్లకు రవిశాస్త్రి ప్రశ్న

10 June 2023, 17:20 IST

google News
    • Ravi Shastri: ఐపీఎల్, టీమిండియా.. రెండిట్లో ఏది ముఖ్యమో భారత ఆటగాళ్లు ప్రాధాన్యం సెట్ చేసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత టాపార్డర్ వైఫల్యం నేపథ్యంలో ఈ సూచనలు చేశాడు.
రవిశాస్త్రి
రవిశాస్త్రి (Twitter)

రవిశాస్త్రి

Ravi Shastri: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC Final) ఫైనల్‍లో టీమిండియా వెనుకంజలో ఉంది. లండన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‍లో తడబడుతోంది. భారత మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‍లో అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‍మన్ గిల్, చతేశ్వర్ పుజారా 18.2 ఓవర్లలోనే ఔటయ్యారు. మొత్తంగా ఆస్ట్రేలియా భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కీలకమైన మ్యాచ్‍లకు ముందు.. ఐపీఎల్, టీమిండియా మధ్య ప్రాధాన్యాలను భారత ఆటగాళ్లు నిర్దేశించుకోవాలని సూచించాడు. వివరాలివే..

డబ్ల్యూటీసీ ఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్‍కు ముందు భారత ఆటగాళ్లు వర్క్ లోడ్ మేనేజ్‍‍మెంట్ పట్టించుకోకుండా ఐపీఎల్‍లో ఆడడంపై రవి శాస్త్రి ప్రశ్నించాడు. బీసీసీఐ కూడా ఈ విషయంలో ఓ క్లాజ్ తీసుకురావాలని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం ప్లేయర్లు అవసరమైతే ఐపీఎల్‍కు దూరంగా ఉండేందుకు వెసులుబాటు కల్పించేలా బీసీసీఐ నిబంధన తీసుకురావాలని అన్నాడు.

భారత ఆటగాళ్లు.. ఐపీఎల్, జాతీయ జట్టు (టీమిండియా) మధ్య ప్రాధాన్యాన్ని నిర్దేశించుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ చానెల్‍తో ఈ విషయంపై మాట్లాడాడు. “మీరు (టీమిండియా ఆటగాళ్లు) కచ్చితంగా ప్రాధాన్యాలను సెట్ చేసుకోవాలి, కదా? ఇండియా లేదా ఫ్రాంచైజీ క్రికెటా(ఐపీఎల్)? ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ క్రికెట్ అంటే.. దీని (డబ్ల్యూటీసీ ఫైనల్) గురించి మర్చిపోండి. ఒకవేళ జాతీయ విధులే (టీమిండియా) ముఖ్యమనుకునే వారి కోసం బీసీసీఐ ఓ రూల్ తీసుకురావాలి. టీమిండియా ప్రయోజనాల దృష్ట్యా ఐపీఎల్‍కు ఆటగాడు దూరం కావాలనుకుంటే ఆ హక్కు అతడికి ఉండేలా ఐపీఎల్ కాంట్రాక్టులో ఓ నిబంధన ఉండాలి. ప్లేయర్లకు ఆ హక్కు ఉంటుంది” అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

“ముందుగా, ఆ క్లాజ్ తీసుకొచ్చి, ఆ తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్రాంచైజీలను బీసీసీఐ అడగాలి. అది చాలా ముఖ్యం. మీరు (బీసీసీఐ) క్రికెట్‍కు కస్టోడియన్‍గా ఉన్నారు. దేశం క్రికెట్‍ను మీరే కంట్రోల్ చేస్తుంటారు కదా” అని రవిశాస్త్రి అన్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‍లో వర్క్ లోడ్ మేనేజ్‍మెంట్, ఫామ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని రవిశాస్త్రి గతంలో కూడా సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‍ను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‍లో ఆడే ప్లేయర్ల గురించి నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐకు కూడా గతంలో సూచనలు ఇచ్చాడు.

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‍లో నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద ఉంది. మొత్తంగా ఆసీస్ 374 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 496 పరుగులు చేయగా.. భారత్ 296 పరుగులకే కుప్పకూలింది. రహానే, శార్దూల్ అర్ధ శతకాలు చేయటంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

తదుపరి వ్యాసం