WTC Final: ఫాలోఆన్ గండం తప్పించిన రహానే, శార్దూల్: భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం-india escapes follow on as rahane shardul thakur fight in wtc final vs australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Escapes Follow On As Rahane Shardul Thakur Fight In Wtc Final Vs Australia

WTC Final: ఫాలోఆన్ గండం తప్పించిన రహానే, శార్దూల్: భారత్ ఆలౌట్.. ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 09, 2023 08:30 PM IST

WTC Final: రహానే, శార్దూల్ ఠాకూర్ రాణించటంతో డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఫాలోఆన్ ప్రమదాన్ని టీమిండియా తప్పించుకుంది. కాగా, ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం దక్కింది.

శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే
శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే (AFP)

WTC Final - India vs Australia: సీనియర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే (89 పరుగులు), ఆల్‍రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) అర్ధ శతకాలతో మెరవటంతో ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియాకు ఫాలోఆన్ పరాభవం తప్పింది. లండన్‍లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజైన శుక్రవారం టీమిండియా 296 పరుగులకు ఆలౌటైంది. 5 వికెట్లకు 151 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆ స్కోరుకు మరో 145 రన్స్ జోడించింది. రహానే, శార్దూల్ రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోల్యాండ్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్ లియాన్‍కు ఓ వికెట్ దక్కింది. 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

ఆదుకున్న రహానే, శార్దూల్

మూడో రోజు తొలి సెషన్ ప్రారంభంలోనే భారత యువ ప్లేయర్ కేఎస్ భరత్ (5) ఆసీస్ పేసర్ బోలండ్ బౌలింగ్‍లో బౌల్డయ్యాడు. మరో ఎండ్‍లో రహానే పోరాటాన్ని కొనసాగించాడు. శార్దూల్ ఠాకూర్.. రహానేకు సహరించాడు. ఆ ఇద్దరూ ఆచితూచి ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో వారిద్దరికీ కాస్త అదృష్టం కలిసి వచ్చింది. నో బాల్ కారణంగా ఓ ఎల్‍బీడబ్ల్యూ ప్రమాదాన్ని రహానే తప్పించుకున్నాడు. రెండు క్యాచ్‍లను కూడా ఆసీస్ ఫీల్డర్లు జారవిడిచారు. ఈ క్రమంలో 92 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు రహానే. మరో ఎండ్‍లో శార్దూల్ కూడా అదరగొట్టాడు.

89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రీన్ పట్టిన మెరుపు క్యాచ్‍కు ఔటయ్యాడు రహానే. దీంతో 109 పరుగుల 7వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పోరాటాన్ని కొనసాగించిన శార్దూల్ 108 బంతుల్లో అర్ధ శతకానికి చేరాడు. అయితే కాసేపటికే ఉమేశ్ యాదవ్ (5) ఔటవగా.. 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శార్దూల్ ఠాకూర్.. గ్రీన్ బౌలింగ్‍లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత షమీ (13) కాసేపు పోరాడి ఔటవటంతో భారత్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‍కు 173 పరుగుల ఆధిక్యం తగ్గింది.

అంతకు ముందు రెండో రోజు భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజార (14), విరాట్ కోహ్లీ (14) తీవ్రంగా విఫలమయ్యారు. అయితే, మూడో రోజు రహానే, శార్దూల్ పోరాటంతో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత్‍కు ఫాలోఆన్ ప్రమాదం తప్పింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‍కు దిగింది. మొత్తంగా ఈ మ్యాచ్‍పై ఆసీస్ ప్రస్తుతం పూర్తి పట్టు బిగించింది.

WhatsApp channel