India medals at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా కొత్త చరిత్ర.. 100 మెడల్స్ పక్కా
06 October 2023, 17:00 IST
- India medals at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా కొత్త చరిత్ర సృష్టించానికి సిద్ధమవుతోంది. 100 మెడల్స్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. దానిని అందుకోవడం ఖాయమైంది.
ఆర్చరీలో గోల్డ్ మెడల్ గెలిచిన అభిషేక్ వర్మ, ప్రథమేష్ జావ్‌కర్, ఓజస్ ప్రవీణ్
India medals at Asian Games: ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా దూసుకెళ్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 655 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్.. 100 మెడల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని శుక్రవారం (అక్టోబర్ 6) ఖాయం చేసుకుంది. ఇప్పటికే 93 మెడల్స్ గెలిచిన ఇండియాకు మరో 8 మెడల్స్ కచ్చితంగా రానున్నాయి.
ఆ మెడల్స్ ఏవన్నది ఇంకా తేలాల్సి ఉన్నా.. 100 పతకాల లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం ఖాయం. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఇండియా ఇలా 100 మెడల్స్ అందుకోనుండటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ 2018లో జకార్తా గేమ్స్ లో అత్యధికంగా 70 మెడల్స్ గెలిచింది. అంతేకాదు ఈసారి ఇండియా 21 గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం.
గతంలో ఇన్ని గోల్డ్ మెడల్స్ కూడా ఎప్పుడూ గెలవలేదు. ఏషియన్ గేమ్స్ 2023లో షూటింగ్, అథ్లెటిక్స్, ఈక్వెస్ట్రియాన్ లాంటి గేమ్స్ లో పతకాల పంట పండించింది. ఇప్పుడు మెన్స్ క్రికెట్ లోనూ గోల్డ్ మెడల్ కోసం ఆఫ్ఘనిస్థాన్ తో ఫైనల్లో తలపడనుంది.
ఇండియా మెడల్స్ ఇలా..
ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా ఇప్పటి వరకూ మొత్తం 93 మెడల్స్ గెలిచింది. అందులో 21 గోల్డ్ మెడల్స్, 33 సిల్వర్, 39 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అత్యధికంగా అథ్లెటిక్స్ లోనే 29 మెడల్స్ వచ్చాయి. ఈ 29 పతకాల్లో 6 గోల్డ్, 14 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత షూటింగ్ లో మరో 22 మెడల్స్ వచ్చాయి. వీటిలో 7 గోల్డ్, 9 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉండటం విశేషం.
ఇక ఆర్చరీ, రోయింగ్, రెజ్లింగ్, స్క్వాష్ లాంటి వాటిలో ఐదేసి మెడల్స్ వచ్చాయి. ఈసారి 100 మెడల్స్ ఖాయంగా అందుకోనున్న ఇండియా.. పతకాల పట్టికలోనూ నాలుగోస్థానంలో నిలవనుంది. ఇండియా ఇంకా ఆర్చరీలో మూడు మెడల్స్, కబడ్డీలో రెండు, బ్యాడ్మింటన్, క్రికెట్, బ్రిడ్జ్, హాకీల్లో ఒక్కో మెడల్ ఖాయం చేసుకుంది. ఇవి కూడా వస్తే ఇండియా 100 టార్గెట్ రీచ్ అవుతుంది.
2002లో బూసాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో 36 మెడల్స్ గెలిచిన ఇండియా.. తర్వాత క్రమంగా మెరుగవుతూనే వస్తోంది. 2010 గువాన్‌గ్జౌ, 2018 జకార్తాల్లోనూ ఇండియా 60కిపైగా మెడల్స్ సాధించింది. ఇప్పుడా మెడల్స్ సంఖ్య 100 దాటనుంది.