Commonwealth Games 2022: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచే గేమ్స్‌కు హైలైట్: సీఈవో
19 July 2022, 21:33 IST
- Commonwealth Games 2022: మెగా స్పోర్టింగ్ ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ కోసం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ ముస్తాబవుతోంది. అయితే ఈసారి గేమ్స్‌కు హైలైట్‌గా నిలవబోతోంది ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే క్రికెట్ మ్యాచ్.
కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా తలపడనున్న ఇండియా, పాకిస్థాన్ మహిళల టీమ్స్
బర్మింగ్‌హామ్: ఇండియా ఎంత క్రికెట్ క్రేజీ నేషన్ అయినా సరే ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్‌లాంటి మెగా ఈవెంట్లు వచ్చినప్పుడు మాత్రం అన్ని స్పోర్ట్స్‌ను సమానంగా ఆదరిస్తుంది. అయితే ఈసారి కేవలం క్రికెట్ లవర్స్‌ను కూడా ఈ గేమ్స్ ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం ఈసారి మహిళల టీ20 క్రికెట్ మ్యాచ్‌లు జరగనుండటమే. అందులోనూ ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ స్థానిక అభిమానులను విపరీతంగా ఆకర్షించినట్లు గేమ్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ దాయాదుల మధ్య జులై 31న ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్ జరగనుంది. దీంతో బర్మింగ్‌హామ్‌లో పెద్ద ఎత్తున ఉన్న ఇండియా, పాకిస్థాన్ దేశాల అభిమానులు ఎగబడి టికెట్లు కొన్నారు. మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం 12 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. ఈ మ్యాచ్ టికెట్లన్నీ దాదాపు పూర్తిగా అమ్ముడైనట్లు ఈ గేమ్స్ సీఈవో ఇయాన్ రీడ్ వెల్లడించారు.
ఇప్పటికే సెమీఫైనల్, ఫైనల్ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయని.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆయన చెప్పారు. తాను కూడా క్రికెట్ అభిమానినే అని, అందులోనూ ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం బర్మింగ్‌హామ్ అభిమానుల దృష్టిని ఆకర్షించినట్లు తెలిపారు. ఈసారి గేమ్స్‌లో ఈ మ్యాచ్ కూడా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇక ఇండియా, ఇంగ్లండ్ ఫైనల్ చేరతాయన్న ఉద్దేశంతో ఇప్పటికే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడైనట్లు రీడ్ చెప్పారు. త్వరలోనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు పూర్తిగా అమ్ముడవుతాయని తెలిపారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో 5 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ 12 లక్షల టికెట్లు అమ్ముడైనా.. గేమ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత పెరగనుందని చెప్పారు.