తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sl | షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​.. భారత్​ లక్ష్యం 147

IND vs SL | షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​.. భారత్​ లక్ష్యం 147

HT Telugu Desk HT Telugu

27 February 2022, 20:50 IST

google News
    • IND vs SL live score | మూడో టీ20లో.. షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​తో శ్రీలంక జట్టు 20ఓవర్లకు 146 పరుగులు చేసింది. ఇక సిరీస్​ను వైట్​వాష్​ చేయాలంటే భారత్​ బ్యాటర్లు కచ్చితంగా రాణించాల్సిందే.
షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​
షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​ (SRI Lanka Cricket twitter)

షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​

IND vs SL 3rd T20 |  ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక జట్టు 20ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వాస్తవానికి.. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ లంక తిరిగి పుంజుకుందంటే.. అది షానక(38బంతుల్లో 74*) కెప్టెన్​ ఇన్నింగ్స్​ వల్లే.

ఇక భారత బౌలర్లలో ఆవేష్​ ఖాన్​ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్​ సిరాజ్​, హర్షల్​ పటేల్​, రవి బిష్ణోయ్​ తలో వికెట్​ తీశారు.

టాప్​ ఆర్డర్​ విలవిల

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న శ్రీలంక ఓపెనర్లు దారుణంగా విఫలమైయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు తొలి 12-13ఓవర్లలో ఏ దశలోనూ కోలుకోలేదు. ఆ జట్టు బ్యాటర్లలో మొదటి నలుగురు.. కనీసం రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇలా వచ్చిన ఓపెనర్లు నిస్సాంక, గుణతిలక.. రెండు ఓవర్లు తిరిగేసరికి అలా పెవీలియన్​కు వెళ్లిపోయారు. గత మ్యాచ్​లో ఆకట్టుకున్న నిస్సాంక ఒక పరుగే చేసి.. ఆవేష్​ ఖాన్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. ఇంకా ఖాతా తెరవని గుణతిలకను.. సిరాజ్​ బౌల్డ్​ చేశాడు. చరిత్​ అసలంక(4), జనిత్​ లియానంగె(9).. ఇలా వచ్చి అలా వెళ్లారు. అప్పటికి శ్రీలంక స్కోరు.. 29/4(8.3ఓవర్లు)

ఆదుకున్న షానక..

ఆ దశలో శ్రీలంక.. కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ మాత్రం స్కోరు సాధించిందంటే.. అది కెప్టెన్​ షానక వల్లే! మరో సీనియర్​ ఆటగాడు దినేష్​ చండిమాల్​(25)తో కలిసి లంక ఇన్నింగ్స్​ను నిర్మించాడు. ఈ జోడీ నెమ్మదిగా పరుగులు తీస్తూ ముందుకు సాగింది. కానీ.. హర్షల్​ పటేల్​ బౌలింగ్​లో చండిమాల్​ వెనుదిరిగాడు.

ఆ తర్వాత కరుణరత్నే(12) సహకారంతో షానక దూకుడు పెంచాడు. ఇతరులు విఫలమైన చోట.. బౌండరీలు బాదుతూ ముందుకెళ్లాడు. ఈ క్రమంలోనే అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఫలితంగా లంక జట్టు 146 పరుగులు చేసింది.

మూడు మ్యాచ్​ల సిరీస్​ను శ్రీలంక ఇప్పటికే 0-2తో కోల్పోయింది. వాట్​వాష్​ నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు బౌలర్లు కచ్చితంగా రాణించాలి. కానీ పటిష్ఠమైన భారత బ్యాటింగ్​ లైనప్​ ముందు ఈ జట్టు ఎంతమేర సరిపోతుందనేది చూడాలి.

తదుపరి వ్యాసం