ICC Men's ODI Team of the Year 2022: బాబర్ ఆజం కెప్టెన్.. టీమ్‌లో ఇద్దరు టీమిండియా ప్లేయర్స్
24 January 2023, 14:01 IST
- ICC Men's ODI Team of the Year 2022: బాబర్ ఆజం కెప్టెన్ కాగా.. ఐసీసీ మెన్స్ వన్డే ఆఫ్ 2022 టీమ్‌లో ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. అయితే స్టార్ ప్లేయర్స్ కోహ్లి, రోహిత్ లకు మాత్రం ఇందులో చోటు దక్కలేదు.
మహ్మద్ సిరాజ్
ICC Men's ODI Team of the Year 2022: ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ 2022లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ కు చోటు దక్కింది. ఈ టీమ్ కెప్టెన్ గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలవడం విశేషం. ఈ వన్డే టీమ్ ఆఫ్ 2022ని మంగళవారం (జనవరి 24) ఐసీసీ అనౌన్స్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన టీ20 టీమ్ లో ముగ్గురు ఇండియన్స్ కు చోటు దక్కగా.. ఈ టీమ్ లో ఇద్దరే ఉన్నారు.
మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ లకు ఈ వన్డే టీమ్ లో చోటు దక్కింది. ఇక న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, వెస్టిండీస్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, జింబాబ్వే, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. గతేడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్స్ ను ఐసీసీ ఈ టీమ్ కోసం ఎంపిక చేసింది.
2021, జులై నుంచి వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంటూ వస్తున్న బాబర్ ఆజం పాకిస్థాన్ నుంచి ఈ టీమ్ లో చోటు దక్కించుకోవడంతోపాటు కెప్టెన్ కావడం విశేషం. ఇక ఇండియా తరఫున 2022లో నిలకడగా ఆడుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్ లో నమ్మదిగన బ్యాటర్ గా ఎదిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 17 వన్డేల్లో 724 రన్స్ చేశాడు. అతని సగటు 55 కాగా.. ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇక మరో టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కూడా ఈ వన్డే టీమ్ ఆఫ్ 2022లో చోటు దక్కించుకున్నాడు. గతేడాది బుమ్రా గాయం కారణంగా చాలా వరకూ టీమ్ కు దూరంగా ఉండటంతో ఆ అవకాశాన్ని సిరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. సిరాజ్ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు. అతని సగటు 23కాగా.. ఎకానమీ రేటు 4.62 మాత్రమే.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ 2022 ఇదే
బాబర్ ఆజం (కెప్టెన్), ట్రెవిస్ హెడ్, షాయ్ హోప్, టామ్ లేథమ్, శ్రేయస్ అయ్యర్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్.