Harmanpreet Kaur Crying: నేను ఏడుస్తుంటే నా దేశం చూడొద్దనే ఇలా చేశాను: హర్మన్‌ప్రీత్ కౌర్
24 February 2023, 10:37 IST
- Harmanpreet Kaur Crying: నేను ఏడుస్తుంటే నా దేశం చూడొద్దనే ఇలా చేశాను అని చెప్పింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హర్మన్ దుఃఖం ఆపుకోలేకపోయింది.
మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీలో సన్ గ్లాసెస్ తో హర్మన్
Harmanpreet Kaur Crying: టీ20 వరల్డ్ కప్ లో మరోసారి ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కు నిరాశ తప్పలేదు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతుల్లో సెమీఫైనల్లో పోరాడి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సెమీస్ లోనూ ఒక దశలో గెలిచేలా కనిపించినా.. కీలకమైన సమయంలో కెప్టెన్ హర్మన్ రనౌట్ కొంప ముంచింది.
అయితే ఈ గెలిచే మ్యాచ్ ఓడిపోవడం హర్మన్ కు మింగుడు పడలేదు. ఆమె మ్యాచ్ తర్వాత దుఃఖం ఆపుకోలేకపోయింది. మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చాల్సి వచ్చింది. ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే తాను ఏడవడాన్ని తన దేశం చూడొద్దన్న ఉద్దేశంతోనే సన్ గ్గాసెస్ పెట్టుకున్నానని మ్యాచ్ ప్రెజెంటేషన్ లో హర్మన్ చెప్పడం విశేషం.
"నేను ఏడుస్తుంటే నా దేశం చూడొద్దు అన్న ఉద్దేశంతోనే ఇలా ఈ గ్లాసెస్ ధరించాను. మేము కచ్చితంగా మెరుగవుతాం. మరోసారి ఇలా నా దేశానికి తలవంపులు తీసుకురాబోనని ప్రామిస్ చేస్తున్నాను" అని హర్మన్ స్పష్టం చేసింది. మరి ఎందుకు కంటతడి పెడుతున్నావ్ అని ప్రెజంటర్ ప్రశ్నించగా.. ఆమె మరింత ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది.
"నేను రనౌట్ అయిన విధానం చూస్తే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. గెలవడానికి ప్రయత్నించడం అన్నది ముఖ్యం. మేము చివరి బంతి వరకూ పోరాడటం నాకు సంతోషంగా ఉంది. చివరి బంతి వరకూ పోరాడాలని ముందే అనుకున్నాం" అని హర్మన్ చెప్పింది. జెమీమాతో కలిసి తాను టీమ్ ను విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని, దీనిని తాము ఊహించలేకపోయామని ఆమె తెలిపింది.
ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హర్మన్ రనౌటైంది. అప్పటికే ఆమె జెమీమాతో కలిసి 4వ వికెట్ కు 69 పరుగులు, రిచాతో కలిసి ఐదో వికెట్ కు 36 పరుగులు జోడించింది. హర్మన్, జెమీమా క్రీజులో ఉన్నప్పుడు ఇండియా గెలుపు ఖాయంగా కనిపించింది. జెమీమా ఔటైన తర్వాత కూడా హర్మన్ హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదుండటంతో ఆమె గెలిపిస్తుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది.
అయితే 15వ ఓవర్లో ఆమె దురదృవషాత్తూ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఈ మ్యాచ్ లో తాము కొన్ని సులువైన క్యాచ్ లు ఇచ్చామని, ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని హర్మన్ స్పష్టం చేసింది.