Harmanpreet Kaur: నేను చివరి వరకూ క్రీజులో ఉంటే గెలిచేవాళ్లమే: సెమీఫైనల్ ఓటమిపై హర్మన్‌ప్రీత్
24 February 2023, 10:07 IST
- Harmanpreet Kaur: నేను చివరి వరకూ క్రీజులో ఉంటే గెలిచేవాళ్లమే అంటూ సెమీఫైనల్ ఓటమిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. కీలకమైన సమయంలో ఆమె రనౌట్ కావడంతో ఇండియా చివరికి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హర్మన్‌ప్రీత్ రనౌటే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్
Harmanpreet Kaur: ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ ఆశలు మరోసారి గల్లంతైన సంగతి తెలుసు కదా. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతుల్లో సెమీఫైనల్లో ఇండియా కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకూ బాగానే పోరాడినా.. చేజింగ్ లో కీలకమైన సమయంలో వికెట్లు పడటం టీమ్ కొంప ముంచింది. దీనికి తన రనౌట్ నే నిందించింది కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.
ఆమెతోపాటు జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా పోరాడారు. వాళ్ల జోరు చూస్తే ఒక దశలో ఇండియా గెలుపు ఖాయంగా కనిపించింది. కానీ 15వ ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లు హర్మన్ రనౌటైంది. దీనిపై మ్యాచ్ తర్వాత స్పందించిన ఆమె.. తాను చివరి వరకూ ఉండి ఉంటే గెలిచే వాళ్లమే అని చెప్పింది.
"నా బ్యాట్ అలా ఇరుక్కపోయి ఉండకపోతే, ఆ రన్ సులువుగా పూర్తి చేసేదాన్ని. నేను చివరి వరకూ క్రీజులో ఉండి ఉంటే మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలిచేవాళ్లం. ఆ తర్వాత కూడా దీప్తి శర్మ ఉంది. రిచా ఘోష్ ఉంది. వాళ్లు పని పూర్తి చేస్తారని అనుకున్నా.
ఇప్పటి వరకూ అన్ని మ్యాచ్ లలో రిచా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. కానీ నేను ఔటైన తర్వాత ఏడెనిమిది బంతులకు పరుగు రాలేదు. అదే టర్నింగ్ పాయింట్. లేదంటే మేమున్న జోరులో మ్యాచ్ సులువుగా పూర్తయ్యేది" అని హర్మన్ స్పష్టం చేసింది.
"నేను, జెమీమా క్రీజులో ఉన్నప్పుడు సులువైన బంతులను బౌండరీలుగా మలచాలని అనుకున్నాం. మొదటి నుంచీ ఓవర్ కు 8 పరుగులు అవసరమయ్యాయి. అందుకే మేము బ్యాటింగ్ చేసే సమయంలో అదే ఆలోచించాం. జెమీమా చాలా పాజిటివ్ గా కనిపించింది. అవతలి వైపు ఉన్న భాగస్వామి నుంచి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుంటుంది.
కానీ నా రనౌట్ టర్నింగ్ పాయింట్. ఆస్ట్రేలియాను 170కి పరిమితం చేస్తే మాకున్న బ్యాటింగ్ లైనప్ తో చేజ్ చేయొచ్చని ముందు నుంచీ అనుకున్నాం. కానీ నా రనౌట్ తర్వాత మ్యాచ్ మలుపు తిరిగింది" అని హర్మన్ చెప్పింది.
ఈ సెమీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట 4 వికెట్లకు 172 రన్స్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో ఇండియా 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లకు 167 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ 52, జెమీమా 43 పరుగులు చేశారు.