Hardik On Washington Sundar : అది వాషింగ్టన్ సుందర్ Vs న్యూజిలాండ్ మ్యాచ్.. హార్దిక్ కామెంట్స్
28 January 2023, 12:04 IST
- 1st T20 IND Vs NZ : న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి T20 మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. జట్టు ఓటమికి కారణం గురించి టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు.
హార్దిక్ పాండ్యా
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి క్లీన్ స్వీప్ చేసింది భారత్. ఇప్పుడు IND Vs NZ T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల పేలవ ప్రదర్శన, స్టార్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణం.
జట్టు విజయం కోసం వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 21 పరుగుల తేడాతో గెలిచిన కివీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీమ్ ఓటమిపై మాట్లాడాడు.
'మ్యాచ్‌లో బంతి ఇంత స్పిన్ తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది రెండు జట్లకు ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవమే. అయితే, న్యూజిలాండ్ జట్టు మంచి ప్రదర్శన చేసింది. పాత బంతితో పోలిస్తే కొత్త బంతిలో చాలా స్పిన్ ఉంది. దీనితో పాటు మరింత బౌన్స్ ఉంది. మాకు పిచ్ సరిగా తెలియదు. బౌలింగ్ కూడా పేలవంగా ఉంది. చివరికి మరో 20-25 పరుగులు ఇచ్చాం.' అంటూ జట్టు ఓటమికి కారణాన్ని హార్దిక్(Hardhik) వివరించాడు.
కేవలం 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు కోసం పోరాడిన వాషింగ్టన్ సుందర్‌ను హార్దిక్ ప్రశంసించాడు. 'ఈ మ్యాచ్‌లో సుందర్ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. న్యూజిలాండ్ vs ఇండియా మ్యాచ్ కాకుండా.., వాషింగ్టన్ సుందర్ Vs న్యూజిలాండ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇటీవల వాషింగ్టన్ సుందర్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇలాంటి ప్రదర్శన కొనసాగితే రానున్న రోజుల్లో టీమ్ ఇండియా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.' అని హార్దిక్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. డెవాన్ కాన్వే (52), డెరల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో న్యూజిలాండ్ 176 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 35, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ తలో వికెట్ తీశారు.
177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెుదట్లోనే వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది. గిల్ 7 పరుగులు, ఇషాన్ కిషన్ 4, రాహుల్ త్రిపాఠి ఔటవడంతో భారత జట్టు 15 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21), సూర్యకుమార్ యాదవ్ (47) భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ విజయానికి చేరువ కాలేదు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో 50 పరుగులు చేసినా.. ఇతర బ్యాటర్లు అతడికి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. చివరికి భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది.