IND vs NZ 1st T20: వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా - తొలి టీ20లో టీమ్ ఇండియా ఓటమి
27 January 2023, 22:43 IST
IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వాషింగ్టన్ సుందర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు.
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య
IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది టీమ్ ఇండియా. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు మాత్రమే చేసింది.
లక్ష్యఛేదనతో బరిలో దిగిన టీమ్ ఇండియాకు పేలవమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు శుభమన్ గిల్ 7 రన్స్, ఇషాన్ కిషన్ 4 పరుగులకు ఔట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాహుల్ త్రిపాఠి డకౌట్ కావడంతో టీమ్ ఇండియా 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ 34 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 47 రన్స్ చేయగా పాండ్య 21 రన్స్ చేశాడు. వీరిద్దరు ఔట్ కావడంతో టీమ్ ఇండియా ఓటమి ఖరారైంది. దీపక్ హుడాతో పాటు టెయిలెండర్లు ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెవిలియర్ చేరారు.
ఓ వైపు వికెట్లు పడుతోన్న వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. అతడి బ్యాటింగ్ మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి తప్పితే ఇండియాకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.
వాషింగ్టన్ సుందర్ 28 బాల్స్‌లో ఐదు ఫోర్లు,మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకొని ఔటయ్యడు. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్, బ్రాస్‌వెల్, ఫెర్గ్యూసన్ తలో రెండు వికెట్లు తీసుకోగా సోది, డఫే లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ ఓటమితో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తో టీమ్ ఇండియా వెనుకబడింది.