Hardik Comment on Runout Rule: క్రీడా స్ఫూర్తిని పక్కన పెట్టండి.. నాన్ స్ట్రైకర్ రనౌట్ రూల్‌పై హార్దిక్ షాకింగ్ కామెంట్
25 October 2022, 11:50 IST
- Hardik Comment on Runout Rule: ఆటలోనే కాదు.. ఆటపట్ల స్పష్టమైన అవగాహన ఉందని కూడా నిరూపిస్తున్నాడు హార్దిక్. తాజాగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్‌ను రనౌట్ చేయడంపై అతడు స్పందించాడు. క్రీడా స్ఫూర్తిని పక్కనపెట్టండి
హార్దిక్ పాండ్య
Hardik Comment on Runout Rule: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోకు తోడు హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన జట్టును విజయతీరాలకు చేర్చింది. మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన అతడు.. అనంతరం బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా ఆడాడు. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌తో దూసుకెళ్తున్న హార్దిక్.. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ అదరగొడుతున్నాడు. ఆటలోనే కాదు.. ఆటపట్ల స్పష్టమైన అవగాహన ఉందని కూడా నిరూపిస్తున్నాడు హార్దిక్. తాజాగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్‌ను రనౌట్ చేయడంపై అతడు తెలివిగా స్పందించాడు. దీప్తి శర్మను ఇంగ్లాండ్ ప్లేయర్ చార్లీ డీన్ రనౌట్ చేసిన వివాదం ఇటీవల చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా హార్దిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
"నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ విషయంలో మనం గొడవ చేయడం మానుకోవాలి. ఇది ఓ నియమం అంతే. క్రీడా స్ఫూర్తి పాటించాలి అనే మాటలను కాసేపు పక్కన పెట్టండి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను క్రీజులో లేనప్పుడు నన్ను ఎవరు రనౌట్ చేసినా అది నా తప్పే అవుతుంది. ఎందుకంటే క్రీజులో ఉండటం నా బాధ్యత." అని ఐసీసీ తాజా రివ్యూపై హార్దిక్ స్పందించాడు.
ఓవర్ రేట్, మ్యాచ్ అప్ గురించి హార్దిక్ వివరించాడు. మ్యాచ్ అప్‌లు నాకు పనిచేయవు. "నేను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాను. నేను ఏ పరిస్థితిలో వచ్చానో చూడండి. మ్యాచ్ అప్‌ల ఎంపిక నాకు లభించదు. టాప్-3 లేదా 4లో బ్యాటింగ్ చేసేవారికి ఈ ఆప్షన్ ఎక్కువగా వర్తిస్తుంది. ఈ పరిస్థితి నేను బౌలర్‌ను తీసుకునే సందర్భం ఉంటుంది. పరిస్థితి డిమండ్ చేయకపోతే అది జట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి నేను ఆ రిస్క్ తీసుకోను" అని హార్దిక్ వివరించాడు.
ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. దాయాది జట్టును 159 పరుగుల మోస్తరు స్కోరుకే పరిమితం చేసింది. అయితే లక్ష్య ఛేదనంలో ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ బ్యాటర్ల వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఇలాంటి సమయలో వచ్చిన విరాట్ కోహ్లీ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే అనంతరం పుంజుకుని పాండ్యాతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతి వరకు పోరాడి 160 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.