Harbhajan on Dhoni: అవును మరి.. ధోనీ ఒక్కడి వల్లే వరల్డ్‌కప్ గెలిచాం.. మిగతా పది మంది లేరు కదా: హర్భజన్
12 June 2023, 16:07 IST
- Harbhajan on Dhoni: అవును మరి.. ధోనీ ఒక్కడి వల్లే వరల్డ్‌కప్ గెలిచాం.. మిగతా పది మంది లేరు కదా అంటూ హర్భజన్ సెటైర్ వేశాడు. ఓ అభిమాని చేసిన ట్వీట్ కు భజ్జీ వ్యంగ్యంగా స్పందించాడు.
హర్భజన్ సింగ్, ధోనీ
Harbhajan on Dhoni: ధోనీ ఒక్కడే ఇండియాకు వరల్డ్ కప్‌లు గెలిపించాన్న అభిమానుల వాదనపై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ మండిపడుతూనే ఉన్నారు. గతంలోనూ వీళ్లు ఈ వాదనను తిప్పికొట్టగా.. తాజాగా ఈ ఇద్దరూ ఒకే రోజు మరోసారి దీనిపై స్పందించారు. ధోనీని అతని పీఆర్ టీమ్ హీరోని చేసిందని, అసలు హీరో యువరాజ్ అని గంభీర్ అన్న విషయం తెలిసిందే.
ఇక హర్భజన్ కూడా ఓ అభిమాని చేసిన ట్వీట్ పై వ్యంగ్యంగా స్పందించాడు. అవును మరి.. ధోనీ ఒక్కడి వల్లే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.. టీమ్ కు ఆడింది అతడు ఒక్కడే కదా అంటూ ఆ అభిమానికి సెటైర్ వేశాడు. చివరిసారి 2013లో ధోనీ కెప్టెన్సీలోనే ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఇండియా.. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో పదేళ్లుగా మరో ట్రోఫీ గెలవలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఇండియాకు వరల్డ్ కప్ లాంటివి అందించడం ధోనీ ఒక్కడి వల్లే సాధ్యమన్న వాదన మరోసారి వినిపిస్తోంది. దీనిపైనే ఓ అభిమాని ట్వీట్ చేయగా.. భజ్జీ సీరియస్ అయ్యాడు. "అవును మరి, ఈ మ్యాచ్ లు ఆడినప్పుడు ఈ యువకుడు ఒక్కడే ఇండియా తరఫున ఆడుతున్నాడు. మిగతా 10 మంది లేరు. అందుకే అతడు ఒక్కడే వరల్డ్ కప్ ట్రోఫీలు గెలిచాడు. ఆస్ట్రేలియా లేదా ఇతర దేశాలు గెలిస్తే ఆ దేశం గెలిచినట్లు రాస్తారు. కానీ ఇండియా గెలిస్తే మాత్రం కెప్టెన్ గెలిచాడంటారు. ఇది టీమ్ స్పోర్ట్స్. కలిసి గెలుస్తారు.. కలిసి ఓడుతారు" అని హర్భజన్ ట్వీట్ చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఇండియా ఓడిపోవడంతో ఐసీసీ ట్రోఫీ కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఇక అప్పటి నుంచీ కెప్టెన్లు మారుతున్నా.. ఇండియా తలరాత మాత్రం మారడం లేదు. దీంతో ఐసీసీ ట్రోఫీలు గెలిపించడం ధోనీ వల్లే సాధ్యమన్న భావన అభిమానుల్లో బలపడుతోంది. అది గంభీర్, భజ్జీలాంటి మాజీలకు రుచించడం లేదు.