Gambhir on Ishan: రోహిత్‌తో ఇషాన్‌ను ఓపెనింగ్ పంపిస్తే చర్చే ఉండదు.. గంభీర్ స్పష్టం
30 December 2022, 16:26 IST
- Gambhir on Ishan: వన్డేల్లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను పంపించాల్సిందిగా గంభీర్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మతో కలిసి అతడిని ఓపెనింగ్ చేయిస్తే ఈ అంశంపై చర్చే ఉండదని స్పష్టం చేశాడు.
ఇషాన్ కిషన్
Gambhir on Ishan: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌ను వచ్చే నెల నుంచి జరగనున్న శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ఓపెనర్ ఎవరనేదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్ పంపిస్తే ఈ చర్చే ఉండదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపడం వల్ల జట్టుకు అదనపు పరుగులు వచ్చే అవకాశం కూడా ఉందని అన్నాడు. ఇటీవలే ఇషాన్ బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
"మనం ఈ విషయంపై చర్చ ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఎవరైనా గత ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసినప్పుడు ఓపెనర్ విషయంలో చర్చ ఎందుకు? రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను పంపిస్తే సరిపోతుంది. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు వీలుకానీ పిచ్‌పై డబుల్ సెంచరీ చేసిన అతడిని స్వదేశంలో ఎందుకు ఆడించకూడదు. 35వ ఓవర్‌కే 200 పరుగులు పూర్తి చేశాడనేది మనం మరవుకూడదు. కాబట్టి అతడికి ఎక్కువ సమయం ఇవ్వాలి. వికెట్ కీపర్‌గానూ రాణించగలడు. రెండు పనులకు ఉపయోగపడే అతడిని తీసుకునేందుకు ఇంత చర్చ అవసరం లేదు. నా వరకైతే చర్చ ముగిసింది." అని గంభీర్ అన్నాడు.
50 ఓవర్ల క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు దొరికిన అమూల్యమైన ఆస్తి అని గంభీర్ స్పష్టం చేశాడు.
"రోహిత్, ఇషాన్ కిషన్‌ను కాదాని వేరొకరిని ఓపెనింగ్ చేయాలని ఆలోచించడం కష్టం. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, సూర్యకుమార్ నాలుగులో, శ్రేయాస్ ఐదో స్థానంలో వస్తారు. శ్రేయాస్ గత ఏడాదిన్నర కాలంగా శ్రేయాస్ బాగా రాణిస్తున్నాడు. అతడు షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నప్పపటికీ ఆ సమస్యను అధిగమించగలడు. కాబట్టి ఐదులో అతడు పర్ఫెక్టుగా సూటవుతాడు. హార్దిక్ పాండ్య ఆరో స్థానంలో వస్తాడు. ఇంక వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ టీమిండియాకు దొరికిన అమూల్యమైన ఆస్తి." అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఇషాన్ కిషన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. అంతేకాకుండా డబుల్ సెంచరీ అతి చిన్న ఆటగాడిగానూ ఘనత సాధించాడు.
టాపిక్