Ishan Kishan Ranji Century: డబుల్ సెంచరీ చేసిన 5 రోజుల్లోనే మరో శతకం.. రంజీ మ్యాచ్‌లో ఇషాన్ విధ్వంసం-ishan kishan hits another century after double double hundred in 5 days ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ishan Kishan Ranji Century: డబుల్ సెంచరీ చేసిన 5 రోజుల్లోనే మరో శతకం.. రంజీ మ్యాచ్‌లో ఇషాన్ విధ్వంసం

Ishan Kishan Ranji Century: డబుల్ సెంచరీ చేసిన 5 రోజుల్లోనే మరో శతకం.. రంజీ మ్యాచ్‌లో ఇషాన్ విధ్వంసం

Maragani Govardhan HT Telugu
Dec 15, 2022 08:12 PM IST

Ishan Kishan Ranji Century: ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన అతడు.. మరోసారి శతకంతో విజృంభించాడు. ఈ సారి కేరళతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు.

ఇషాన్ కిషన్ సెంచరీ
ఇషాన్ కిషన్ సెంచరీ (PTI)

Ishan Kishan Ranji Century: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లాతో జరిగిన చివరి వన్డేలో చోటు దక్కించుకున్న అతడు తన మొదటి శతకాన్ని డబుల్‌గా మార్చి విధ్వంసం సృష్టించాడు. 131 బంతుల్లోనే 210 పరుగులతో రికార్డు సృష్టించాడు. తాజాగా మరోసారి సెంచరీతో కదం తొక్కాడు ఇషాన్. డబుల్ సెంచరీ చేసిన 5 రోజుల వ్యవధిలోనే శతకంతో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఝార్ఖండ్‌ తరపున ఆడుతున్న అతడు సెంచరీతో చెలరేగాడు.

డిసెంబరు 13న కేరళ-ఝార్ఖండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాగా.. ఆట మూడో రోజున ఇషాన్‌కు బ్యాటింగ్ ఆడే అవకాశమొచ్చింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు మరోసారి విధ్వంసం సృష్టించాడు. 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న ఝార్ఖండ్ జట్టును ఆదుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ అగ్రెసివ్ స్టైల్‌తో పరుగులు రాబట్టాడు. 195 బంతుల్లోనే 132 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. సహచర బ్యాటర్ సౌరబ్ తీవారీతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. సౌరభ్ తీవారి 97 పరుగులతో తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్-సౌరబ్ తీవారీ రాణించడంతో 340 పరుగులకు ఆలౌటైంది.

అయితే అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాటర్ అక్షయ్ చంద్రన్(150) భారీ సెంచరీ చేయడంతో మెరుగైన స్కోరు సాధించింది కేరళ.. ఆర్ ప్రేమ్(79), కున్నుమ్మల్(50), సంజూ శాంసన్(72), సిజిమోన్(83) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కేరళ.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 195 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

కేరళ బౌలర్ లలజ్ సక్సెనా 5 వికెట్లతో పడగొట్టాగ.. ఝార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలి ఇన్నింగ్స్‌ 5, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆటలో మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ టై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం