తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir On Ishan Kishan: సిక్స్‌లు కొట్టడం కాదు.. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో: ఇషాన్‌పై గంభీర్ ఫైర్

Gambhir on Ishan Kishan: సిక్స్‌లు కొట్టడం కాదు.. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో: ఇషాన్‌పై గంభీర్ ఫైర్

Hari Prasad S HT Telugu

30 January 2023, 11:17 IST

google News
    • Gambhir on Ishan Kishan: సిక్స్‌లు కొట్టడం కాదు.. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో అంటూ ఇషాన్‌ కిషన్ పై మండిపడ్డాడు మాజీ క్రికెటర్ గంభీర్. అతడు స్పిన్ ఆడటం నేర్చుకోకపోతే కష్టమేనని అనడం గమనార్హం.
గౌతమ్ గంభీర్, ఇషాన్ కిషన్
గౌతమ్ గంభీర్, ఇషాన్ కిషన్ (PTI)

గౌతమ్ గంభీర్, ఇషాన్ కిషన్

Gambhir on Ishan Kishan: గతేడాది బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ను అందరూ ఆకాశానికెత్తారు. ఇక అతని కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావించారు. కానీ ఆ తర్వాత తనకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఇషాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోనూ అతడు విఫలమవుతున్నాడు.

రెండో టీ20లో ఇండియా గెలిచినా.. ఇషాన్ మాత్రం కేవలం 4 పరుగులే చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో అతడు విఫలమైన తర్వాత మాజీ క్రికెటర్ గంభీర్ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. భారీ షాట్లు ఆడటం సులువే కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకోవాలని అన్నాడు. అంతేకాదు ఇషాన్ స్పిన్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేశాడు.

"ఇషాన్ లో ఇదొక్క లోపమే కాదు. మొత్తం ఇండియన్ బ్యాటింగ్ యూనిట్ స్పిన్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడింది. కాస్త తెలివితో ఆడే సామర్థ్యం లేదు. పెద్ద పెద్ద సిక్స్ లు కొట్టడం సులువే కానీ.. స్ట్రైక్ ను నిలకడగా రొటేట్ చేసే సామర్థ్యం ఉండాలి. స్పిన్నర్స్ కు కూడా బాగానే సహకారం లభించింది. ఇషాన్ కిషన్ కు మైకేల్ బ్రేస్‌వెల్ తో బౌలింగ్ చేయించడమే అందుకు నిదర్శనం" అని గంభీర్ మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ తో అన్నాడు.

"ఈ యువ ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడాన్ని త్వరగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వికెట్ పై ముందుకు దూసుకొచ్చి భారీ సిక్స్ లు కొట్టడం సాధ్యం కాదు. బంగ్లాదేశ్ లో ఆ డబుల్ సెంచరీ తర్వాత అతని ఆటతీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ తర్వాత అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని అందరూ భావించారు" అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఇక స్పిన్ బౌలింగ్ ను కూడా ఇషాన్ సరిగ్గా ఆడలేకపోతున్నాడని అతడు అన్నాడు. "స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంపై ఇషాన్ చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ తొలి 6 ఓవర్లలోనే అతనిపై స్పిన్ ను ప్రయోగిస్తారు. ఫాస్ బౌలింగ్ ను అతడు బాగానే ఆడుతున్నాడు. స్పిన్ బౌలింగ్ లో ఆడటం ఎంత త్వరగా నేర్చుకుంటే అతనికి అంత మంచిది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో.." అని గంభీర్ సూచించాడు.

తదుపరి వ్యాసం