Gambhir on Rohit: రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు.. కోహ్లిలాగే అతన్నీ టార్గెట్ చేయాలన్న గంభీర్
Gambhir on Rohit: రోహిత్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. దీంతో ఒకప్పుడు విరాట్ కోహ్లిని ఎలా టార్గెట్ చేశామో అతన్నీ టార్గెట్ చేయాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనడం గమనార్హం.
Gambhir on Rohit: శ్రీలంకపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వరల్డ్‌కప్ ఏడాదిని ఘనంగా మొదలుపెట్టింది టీమిండియా. ముఖ్యంగా చివరి వన్డేలో అయితే ఏకంగా 317 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత భారీ తేడాతో గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో 390 రన్స్ చేసిన ఇండియన్ టీమ్.. తర్వాత శ్రీలంకను కేవలం 73 రన్స్‌కే కుప్పకూల్చింది.
విరాట్ కోహ్లి 110 బాల్స్‌లోనే 166 రన్స్ చేశాడు. వన్డే కెరీర్‌లో అతనికిది 46వ సెంచరీ. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి 42 పరుగులతో మంచి ఆరంభమే అందుకున్నా.. దానిని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో ఇంటర్నేషల్ క్రికెట్‌లో రోహిత్ సెంచరీ లేకుండా 50 ఇన్నింగ్స్ గడిపినట్లు అయింది. ఒకప్పుడు భారీ సెంచరీలను అవలీలగా చేసేసిన రోహిత్ ఇప్పుడు మూడంకెల స్కోరు అందుకోవడానికి తంటాలు పడుతున్నాడు.
తొలి వన్డేలో 83 రన్స్ వరకూ వచ్చి ఔటయ్యాడు. దీంతో రోహిత్ విషయంలోనూ కాస్త కఠినంగా వ్యహరించాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. విరాట్ సెంచరీలు చేయలేకపోయినప్పుడు అతన్ని ఎలాగైతే టార్గెట్ చేశామో.. రోహిత్ విషయంలోనూ అలాగే చేయాలని అనడం గమనార్హం. స్టార్ స్పోర్ట్స్‌లోని ప్యానలిస్ట్‌లలో ఒకడిగా ఉన్న గంభీర్.. రోహిత్ 50 ఇన్నింగ్స్‌గా సెంచరీ చేయలేకపోయిన విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
"విరాట్ గత మూడున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోతే ఎలాగైతే మాట్లాడుకున్నామో ఇప్పుడు రోహిత్‌తోనూ అలాగే మాట్లాడాలి. అతనితోనూ కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 50 ఇన్నింగ్స్ అంటే చాలా ఎక్కువ" అని గంభీర్ అన్నాడు.
గతేడాది బంగ్లాదేశ్ టూర్‌లో గాయపడిన రోహిత్.. కొత్త ఏడాదిలో శ్రీలంకతో సిరీస్‌కు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే తొలి వన్డేలో 67 బాల్స్‌లోనే 83 రన్స్ కొట్టాడు. మూడో వన్డేలోనూ మంచి టచ్‌లో కనిపించాడు. కానీ 42 రన్స్ దగ్గరే ఔటయ్యాడు. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఉన్న ఫామ్‌ను ఇప్పుడు తిరిగి అందుకోవాల్సిన అవసరం ఉన్నదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లోపు రోహిత్ తిరిగి పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావాలని అన్నాడు.
"ఏదో ఒకటో, రెండో సిరీస్‌లలో 100 కొట్టకపోవడం కాదు. గత వరల్డ్‌కప్ నుంచీ అతడు సెంచరీ చేయలేదు. అతడు ఒకప్పుడు భారీ సెంచరీలు చేసేవాడు. ఇప్పుడు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. బాల్‌ను బాగానే కొట్టగలుగుతున్నాడు. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. విరాట్, రోహిత్ మధ్య తేడా ఏంటంటే.. విరాట్ తిరిగి తన మునుపటి ఫామ్ అందుకున్నాడు. రోహిత్ ఇంకా అందుకోవాల్సి ఉంది. అది వరల్డ్‌కప్‌కు ముందే జరగాలి. ఎందుకంటే ఈ వరల్డ్‌కప్‌లో ఇండియా రాణించాలంటే ఈ కోహ్లి, రోహితే ముఖ్యం" అని గంభీర్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం
టాపిక్