తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup Teams With Most Appearances: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువసార్లు ఆడిన టీమ్స్‌ ఇవే

FIFA World Cup Teams with most appearances: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువసార్లు ఆడిన టీమ్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu

07 November 2022, 10:28 IST

google News
    • FIFA World Cup Teams with most appearences: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువసార్లు ఆడిన టీమ్స్‌ ఏవో మీకు తెలుసా? ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే అవకాశం రావడమే అరుదు. కానీ కొన్ని టీమ్స్‌ మాత్రం ఇప్పటికే ఎన్నోసార్లు పార్టిసిపేట్‌ చేశాయి.
2002 వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్
2002 వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్

2002 వరల్డ్ కప్ గెలిచిన బ్రెజిల్

FIFA World Cup Teams with most appearences: ఫిఫా వరల్డ్‌కప్‌ వచ్చేస్తోంది. ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ 18 వరకూ సుమారు నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులను అలరించడానికి ఈ మెగా టోర్నీ సిద్ధమవుతోంది. ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో 32 టీమ్స్‌ టైటిల్‌ కోసం పోరాడనున్నాయి.

అయితే ఫుట్‌బాల్‌లో దశాబ్దాలుగా కొన్ని టీమ్స్‌ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాయి. బ్రెజిల్‌, అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్‌లాంటి టీమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎక్కువసార్లు ఆడిన టీమ్స్‌ ఏవో ఒకసారి చూద్దాం.

బ్రెజిల్‌ - 21 సార్లు

ఫుట్‌బాల్‌ అంటే బ్రెజిల్‌.. బ్రెజిల్‌ అంటే ఫుట్‌బాల్‌ అన్నట్లుగా ఉంటుంది. వరల్డ్‌ ఫుట్‌బాల్‌ను ఈ టీమ్‌ డామినేట్‌ చేసినట్లుగా మరే టీమ్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకూ వరుసగా 21 వరల్డ్‌కప్‌లలో బ్రెజిల్‌ ఆడటం విశేషం. 109 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడింది. అందులో 73 మ్యాచ్‌లలో గెలిచి, 18 ఓడి, మరో 18 డ్రాగా ముగించింది.

పీలే, రొనాల్డో, రొమారియో, రొనాడినో, కాఫు, నెయ్‌మార్‌లాంటి స్టార్‌ ప్లేయర్స్‌ను ప్రపంచ ఫుట్‌బాల్‌కు అందించింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్లేఆఫ్స్ అవసరం లేకుండా అన్ని వరల్డ్‌కప్‌లలో ఆడిన ఘనత బ్రెజిల్‌ సొంతం. అయితే 2002లో చివరిసారి వరల్డ్‌కప్‌ గెలిచిన బ్రెజిల్‌.. 20 ఏళ్లుగా మళ్లీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది.

జర్మనీ - 19 సార్లు

ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో బ్రెజిల్‌ తర్వాత అత్యధికసార్లు ఆడిన ఘనత యురోపియన్‌ దేశమైన జర్మనీ సొంతం. ఇప్పటి వరకూ ఆ టీమ్‌ 109 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో 67 గెలిచి, 22 ఓడి, మరో 20 డ్రా చేసుకుంది. 2014లో ఆ టీమ్‌ చివరిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2018లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగినా గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. జర్మనీ టీమ్‌ 1930లో తొలి వరల్డ్‌కప్‌లో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1950లో మరోసారి ఆడలేదు.

ఇటలీ - 18 సార్లు

మరో యురోపియన్‌ దేశం ఇటలీ 18 సార్లు వరల్డ్‌కప్‌లో ఆడి మూడోస్థానంలో నిలిచింది. కాకపోతే 2018, 2022 వరల్డ్‌కప్‌లకు మాత్రం ఆ టీమ్‌ క్వాలిఫై కాకపోవడం గమనార్హం. 18 వరల్డ్‌కప్‌లలో 83 మ్యాచ్‌లు ఆడి 45 గెలిచి, 17 ఓడింది. మరో 21 డ్రా చేసుకుంది. ప్లేఆఫ్స్‌ సెమీఫైనల్లో నార్త్‌ మెసడోనియా చేతుల్లో ఓడి 2022 టోర్నీకి ఇటలీ అర్హత సాధించలేకపోయింది. అంతకుముందు 1930, 1958లలో కూడా ఇటలీ ఆడలేదు.

అర్జెంటీనా- 17 సార్లు

బ్రెజిల్‌ తర్వాత ఫుట్‌బాల్‌లో అంతటి క్రేజ్‌ ఉన్న మరో సౌత్‌ అమెరికా దేశం అర్జెంటీనా. ఈ టీమ్‌ ఇప్పటి వరకూ 17సార్లు వరల్డ్‌కప్‌లలో ఆడింది. మొత్తం 21 టోర్నీల్లో నాలుగుసార్లు మాత్రం ఆడలేకపోయింది. 81 మ్యాచ్‌లలో 43 గెలిచి, 23 ఓడింది. 1938, 1950, 1954లలో వరల్డ్‌కప్‌ల నుంచి తప్పుకుంది. 1978, 1986లలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మారడోనా, మెస్సీలాంటి ప్లేయర్స్‌ ఈ టీమ్‌ నుంచి వచ్చారు.

స్పెయిన్‌ - 15సార్లు

యురోపియన్‌ దేశమైన స్పెయిన్‌ వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకూ 15సార్లు ఆడింది. 1934లో తొలిసారి ఆడిన ఆ టీమ్‌.. క్వార్టర్‌ఫైనల్స్‌లో ఇటలీ చేతుల్లో ఓడింది. 63 మ్యాచ్‌లలో 30 గెలిచి, 18 ఓడిపోయింది. 2010లో తమ ఏకైక వరల్డ్‌కప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. 1974లో జర్మనీ రెండుగా విడిపోయిన సమయంలో స్పెయిన్‌ వరల్డ్‌కప్‌లో ఆడలేదు. ఆ తర్వాత ప్రతి టోర్నీలో ఆడుతోంది.

తదుపరి వ్యాసం