India vs Sri Lanka: విజృంభించిన లంక బ్యాటర్లు. భారత బౌలర్లను ఊచకోత.. టీమిండియాకు భారీ లక్ష్యం
05 January 2023, 20:56 IST
- India vs Sri Lanka: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా.. అక్షర్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంక-భారత్
India vs Sri Lanka: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కుశాల్ మెండీస్(52) అర్ధశతకంతో విజృంభించగా.. కెప్టెన్ దసున్ శనకా(56) చివర్లో విజృభించడంతో ఫలితంగా శ్రీలంక.. టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ 2 వికెట్లతో రాణించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు అదిరిపోయే ఆరంభం దక్కించుకుంది. ఓపెనర్లు నిశాంక(33), కుశాల్ మెండీస్(52) అదరగొట్టారు. వీరిద్దరూ ఎడా పెడా బౌండరీలు బాదుతూ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నిశాంక నిలకడగా రాణించగా.. కుశాల్ మెండీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లో 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 3 ఫోర్లు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో చాహల్‌కు వికెట్ ముందు దొరికాడు. ఫలితంగా 80 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది.
కుశాల్ మెండీస్ ఔటైన కాసేపటికే వన్డౌన్ బ్యాటర్ భానుకా రాజపక్స(2) కూడా ఉమ్రాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ నిశాంక అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే ధనంజయ డిసిల్వా(3)ను కూడా పెవిలియన్ చేర్చాడు అక్షర్. ఇలా కొద్ది సేపట్లోనే అసలంక(37), వానిందు హసరంగా(0) వికెట్లను కోల్పోయింది లంక జట్టు.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దసున్ శనకా అదరగొట్టాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి విధ్వంసం సృష్టించాడు. వరుస పెట్టి బౌండరీలు సిక్సర్లు బాదుతూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శివమ్ మావి వేసిన చివరి ఓవర్లు 3 సిక్సర్లు సహా 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 22 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరును సాధించింది.