India Vs Ireland : హెడ్ కోచ్ లేకుండానే ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా
12 August 2023, 6:01 IST
- India Vs Ireland : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు వెళ్లనుంది. అయితే హెడ్ కోచ్ లేకుండానే ఐర్లాండ్ టూర్ లో పాల్గొననుంది.
బుమ్రా
వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఆసియా కప్, ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ యువ ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశం. చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. బుమ్రాకు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఈ సిరీస్ కోసం, జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని కోచింగ్ సిబ్బందికి విశ్రాంతి ఇవ్వాలని, NCA చీఫ్ VVS లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తద్వారా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు ప్రధాన కోచ్ లేకుండానే భారత్ పర్యటించనుందని తెలుస్తోంది.
కొన్ని సంవత్సరాలుగా ప్రధాన కోచ్ విరామంలో ఉంటే, NCA చీఫ్ ప్రధాన కోచ్‌గా వెళ్లేవారు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు ఎన్‌సీఏ చీఫ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ చాలా సందర్భాల్లో ఈ బాధ్యతలు చేపట్టారు. తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ కూడా దాన్ని కొనసాగించారు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం NCA అసిస్టెంట్ కోచ్‌లు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే జస్ప్రీత్ బుమ్రా జట్టుతో పాటు ఉంటారు. వీవీఎస్ లక్ష్మణ్ గతంలో న్యూజిలాండ్, ఐర్లాండ్‌లో పర్యటించినప్పుడు ఈ ఇద్దరు కూడా అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు.
ఈ సిరీస్‌లో ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టకపోవడానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు, ఆసియా కప్ చివరి దశకు సన్నద్ధం కావడానికి రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా ప్రధాన జట్టు ఆగస్టు 24న బెంగళూరులోని NCAలో విరామం తర్వాత సమావేశమవుతుంది.
ఐర్లాండ్ సిరీస్ కోసం భారత జట్టు : జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, పర్హిధర్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.