Stokes Catch: యాషెస్ చివరి రోజు మరో వివాదం.. స్మిత్ క్యాచ్ స్టోక్స్ పట్టినా ఎందుకు ఔటివ్వలేదు?
31 July 2023, 20:18 IST
- Stokes Catch: యాషెస్ చివరి రోజు మరో వివాదం తలెత్తింది. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పట్టినా ఎందుకు ఔటివ్వలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను గాల్లోకి ఎగిరి అందుకుంటున్న స్టోక్స్
Stokes Catch: యాషెస్ సిరీస్ చివరి రోజు మరో వివాదం రేగింది. ఓ క్యాచ్ విషయంలో ఇంగ్లండ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పట్టుకున్నాడు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. ఇంగ్లండ్ డీఆర్ఎస్ తీసుకోగా.. మూడో అంపైర్ కూడా రీప్లేలు చూసి నాటౌట్ గా ప్రకటించాడు.
అది ఔటా.. నాటౌటా..
ఈ క్యాచ్ ఎందుకు నాటౌట్ గా ఇచ్చారో రీప్లేలు చూస్తే స్పష్టమవుతుంది. మొయిన్ అలీ బౌలింగ్ లో స్టోక్స్ లెగ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. స్మిత్ గ్లోవ్స్ కి తగిలిన బాల్ ను స్టోక్స్ గాల్లోకి జంప్ చేసి పట్టుకున్నాడు. అయితే ఆ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో అతని చేయి తొడకు తగిలి బాల్ కింద పడిపోయింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
స్టోక్స్ కు కూడా పరిస్థితి అర్థమై కాసేపు కామ్ గా ఉన్నా.. తర్వాత డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేల్లో బంతి స్మిత్ గ్లోవ్స్ కి తగలడంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. అయితే క్యాచ్ మాత్రం పూర్తి కాలేదని రీప్లేల్లో తేలింది. దీంతో మూడో అంపైర్ కూడా నాటౌట్ అని స్పష్టం చేశాడు. ఇది ఇంగ్లండ్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. నిబంధనల ప్రకారం ఇది నాటౌటే.
స్టోక్స్ క్యాచ్ పూర్తి చేయలేదని స్పష్టమవుతోంది. అయితే కీలకమైన సమయంలో ఇది జరగడంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ గెలవాలంటే 384 పరుగులు చేయాల్సిన దశలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో పోరాడుతోంది. 3 వికెట్లకు 238 పరుగులు చేసి విజయంపై కన్నేసిన దశలో వర్షం కురిసింది. దీంతో లంచ్ తర్వాత ఆట సాధ్యం కాలేదు.
స్మిత్ 40, హెడ్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఖవాజా 72, వార్నర్ 60 పరుగులతో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం ఇచ్చారు. ఇప్పటికే సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా 2001 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి యాషెస్ గెలిచినట్లు అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిచినా.. సిరీస్ 2-2తో సమమై.. చివరిసారి యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా దగ్గరే ట్రోఫీ ఉంటుంది.