Asia Cup 2023 IND VS PAK : ఆసియా కప్ భారత్ వర్సెస్ పాక్.. ఎవరు గెలుస్తారు? చరిత్ర ఏం చెబుతోంది?
22 July 2023, 10:24 IST
- Asia Cup 2023 IND VS PAK : ఆసియా కప్ దగ్గర పడుతోంది. చిరకాల ప్రత్యర్థితో భారత్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో పరిస్థితి ఎలా ఉంది?
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఈ ఏడాది ఆసియా కప్(Asia Cup) టోర్నీని పాకిస్థాన్, శ్రీలంకలో హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 30న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు 2023 ఆసియా కప్ లో తమ మొదటి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో ఆడనుంది. సెప్టెంబరు 4న చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ నేపాల్‌తో తలపడనుంది.
2023లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు 17వ సారి పోటీ పడనున్నాయి. రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్(IND Vs PAK) మ్యాచ్‌లు ఎప్పుడూ హై-వోల్టేజీగా ఉంటాయి. ప్రస్తుతం టోర్నీలో భారత్ హోరాహోరీగా ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ భారత జట్టు 9 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ 7 సార్లు గెలిచింది.
1984లో ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు తొలిసారి తలపడ్డాయి. ఆ తర్వాత భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఆసియా కప్ ఫైనల్స్(Asia Cup Finals)లో మూడుసార్లు తలపడగా, మూడుసార్లు భారత్ గెలిచింది. ఇటీవలే 2022 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. లీగ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ 4లో ఓటమి చవిచూసింది. భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్‌లో IND Vs PAK గణాంకాలు
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో భారత్ 9 గెలుపొందగా, పాకిస్థాన్ 7 గెలిచింది.
2004లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ అత్యధిక స్కోరు 354/5.
1995లో ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అత్యల్ప స్కోరు 123 పరుగులు.
2004లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ యూసుఫ్ 148 పరుగులు చేశాడు, ఇది ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య అత్యధిక వ్యక్తిగత స్కోరు.
2004 ఆసియా కప్‌లో భారత ఆటగాడు జహీర్ ఖాన్ పాకిస్థాన్‌పై 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ఏ జట్టు విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 2న 2023 ఆసియా కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఆడనుంది.