తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Video - Ashes: యాషెస్‍లో రనౌట్‍ నిర్ణయంపై వివాదం! ఔటా.. నాటౌటా?: వీడియో

Video - Ashes: యాషెస్‍లో రనౌట్‍ నిర్ణయంపై వివాదం! ఔటా.. నాటౌటా?: వీడియో

29 July 2023, 14:21 IST

google News
    • Video - Ashes: యాసెష్ సిరీస్‍లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్టీవ్ స్మిత్ విషయంలో ఇది జరిగింది. అంపైర్ నిర్ణయంతో ఇంగ్లండ్ ప్లేయర్లు షాకయ్యారు.
Video - Ashes: యాషెస్‍లో రనౌట్‍ నిర్ణయంపై వివాదం! ఔటా.. నాటౌటా?: (Photo: ECB)
Video - Ashes: యాషెస్‍లో రనౌట్‍ నిర్ణయంపై వివాదం! ఔటా.. నాటౌటా?: (Photo: ECB)

Video - Ashes: యాషెస్‍లో రనౌట్‍ నిర్ణయంపై వివాదం! ఔటా.. నాటౌటా?: (Photo: ECB)

Video - Ashes: అంతర్జాతీయ క్రికెట్‍లో ఇటీవల కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. థర్డ్ అంపైర్లు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ ఐదో టెస్టులోనూ ఇలాంటిదే ఒకటి జరిగింది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం (జూలై 28) ఇంగ్లండ్ బౌలర్లు సమిష్టిగా చెలరేగటంతో ఆస్ట్రేలియా 295 పరుగులకు ఆలౌటైంది. 12 పరుగుల పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే, ఈ క్రమంలో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రనౌట్ గురించి థర్డ్ అంపైర్ ప్రకటించిన నిర్ణయం వివాదంగా మారింది.

మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం 78వ ఓవర్లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేసిన బంతిని స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ వైపుగా ఆడాడు. రెండో పరుగు కోసం వేగంగా వెళ్లాడు. ఇంగ్లండ్ సబ్‍స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హమ్ బంతిని అందుకొని వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకు త్రో వేశాడు. బంతిని పట్టుకున్న బెయిర్‌స్టో వెంటనే వికెట్లను కొట్టాడు. క్రీజులోకి చేరుకునేందుకు స్మిత్ డైవ్ చేశాడు. ఈ రనౌట్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు ఫీల్డ్ అంపైర్స్. అయితే, చాలా యాంగిళ్లను.. చాలా సార్లు రిప్లే చూశాడు థర్డ్ అంపైర్. అయితే, బెయిర్‌స్టో వికెట్లను గిరాటేసేటప్పటికి స్మిత్ బ్యాక్ క్రీజులోకి రానట్టే కనిపించింది.

స్టంప్స్ పడే సరికి స్మిత్ బ్యాట్ క్రీజులోపలికి రాలేదని భావించి ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. స్మిత్ కూడా పెవిలియన్ వైపు నడిచాడు. అయితే, బిగ్ స్క్రీన్‍పై థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని చూసి అందరూ అవాక్కయ్యారు. స్మిత్ నాటౌట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించారు. దీంతో ఆటగాళ్లు, కామెంటేటర్లు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ రనౌట్ నిర్ణయం తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఇంగ్లండ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

కాగా, స్టీవ్ స్మిత్ 71 పరుగులు చేయటంతో ఓ దశలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా కోలుకుంది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసింది. ఆసీస్‍కు 12 పరుగుల ఆధిక్యం దక్కింది. నేడు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ ఆటను మొదలుపెట్టనుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 283 పరుగులు చేసింది.

తదుపరి వ్యాసం