తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashes 2023 : యాషెస్ సిరీస్ 2-2తో సమం.. స్టువర్ట్ బ్రాడ్‌కు గొప్ప వీడ్కోలు

Ashes 2023 : యాషెస్ సిరీస్ 2-2తో సమం.. స్టువర్ట్ బ్రాడ్‌కు గొప్ప వీడ్కోలు

Anand Sai HT Telugu

01 August 2023, 9:19 IST

google News
    • Ashes 2023 : 2023 యాషెస్ టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ జూలై 31 సోమవారం ముగిసింది. ఆతిథ్య ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
స్టువర్ట్ బ్రాడ్
స్టువర్ట్ బ్రాడ్

స్టువర్ట్ బ్రాడ్

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా సాగిన యాషెస్ టెస్ట్ సిరీస్ ముగిసింది. యాషెస్ సిరీస్ కు గొప్ప ముగింపు లభించింది. సిరీస్ చివర రోజున.. ఇరు జట్ల నడుమ పోరు నువ్వా..నేనా అన్నట్టుగా సాగింది. వర్షంతో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఇరు జట్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. చివరకు మ్యాచ్ ఇంగ్లాండ్ సొంతమైంది. దీంతో సిరీస్ 2-2తో సమం అయింది.

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. చివరి రోజున ఆస్ట్రేలియా జట్టు చివరి రెండు వికెట్లు పడగొట్టి చిరస్మరణీయంగా నిలిచాడు. 384 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా.. చివరి సెషన్‌లో శుభారంభం ఇచ్చినప్పటికీ ఒత్తిడిలో పడింది. క్రిస్ వోక్స్.. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా వికెట్లను తీయడం ద్వారా విజయంపై ఇంగ్లాండ్ కు ఆశలు రేకెత్తించాడు.

వికెట్ నష్టపోకుండా 135 పరుగులతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ విజయానికి 249 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 72 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 13 పరుగులు, స్టీవెన్ స్మిత్ 54 పరుగులు, ట్రావిస్ హెడ్ 43 పరుగులు, మిచెల్ మార్ష్ 6 పరుగులు, అలెక్స్ కారీ 28 పరుగులు, టాడ్ మర్ఫీ 18 పరుగులు చేశారు.

ఇంగ్లండ్ జట్టులో క్రిస్ వోక్స్ 19 ఓవర్లలో 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, మొయిన్ అలీ 23 ఓవర్లలో 76 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లు, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 295 పరుగులు చేసి 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 395 పరుగులకు ఆలౌటైంది. 384 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 334 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకోగా, క్రిస్ వోక్స్, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును పంచుకున్నారు.

యాషెస్ 2023 2-2తో సమం అయింది. అయితే గత సిరీస్ ను ఆస్ట్రేలియానే గెలవడంతో యాషెస్ ట్రోఫీ ఆస్ట్రేలియాతోనే కొనసాగనుంది.

తదుపరి వ్యాసం