తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci: రిషబ్ పంత్‍ గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చిన బీసీసీఐ

BCCI: రిషబ్ పంత్‍ గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చిన బీసీసీఐ

21 July 2023, 19:51 IST

google News
    • Rishabh Pant - BCCI: రిషబ్ పంత్, జస్‍ప్రీత్ బుమ్రా ఫిట్‍నెస్, మెడికల్ అప్‍డేట్‍ను బీసీసీఐ వెల్లడించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ గురించి కూడా పేర్కొంది.
BCCI: రిషబ్ పంత్‍ గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చిన బీసీసీఐ (Photo: ANI) (ఫైల్ ఫొటో)
BCCI: రిషబ్ పంత్‍ గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చిన బీసీసీఐ (Photo: ANI) (ఫైల్ ఫొటో)

BCCI: రిషబ్ పంత్‍ గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చిన బీసీసీఐ (Photo: ANI) (ఫైల్ ఫొటో)

Rishabh Pant - BCCI: గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు డిసెంబర్ నుంచి క్రికెట్‍కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉన్నాడు. వెన్ను సర్జరీ చేయించుకున్న తర్వాత భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కూడా ఎన్‍సీఏలో ఉన్నాడు. మరోవైపు, టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వేర్వేరు సందర్భాల్లో గాయపడ్డారు. దీంతో, ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‍కు టీమిండియాకు ఇబ్బందిగా మారింది. కాగా, ఈ ఐదుగురు ఆటగాళ్ల మెడికల్, ఫిట్‍నెస్‍పై బీసీసీఐ నేడు (జూలై 21) అప్‍డేట్ వెల్లడించింది.

రిషబ్ పంత్ నెట్స్‌లో బ్యాటింగ్, కీపింగ్ మొదలుపెట్టాడని బీసీసీఐ మెడికల్ అప్‍డేట్‍లో పేర్కొంది. “రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్‍తో పాటు వికెట్ కీపింగ్ మొదలుపెట్టాడు. స్ట్రెన్త్, ఫ్లెక్సిబులిటీ, రన్నింగ్ కోసం డిజైన్ చేసిన ప్రత్యేకమైన ఫిట్‍నెస్ ప్రొగ్రామ్‍ను అతడు ప్రస్తుతం ఫాలో అవుతున్నాడు” అని బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ నాటికి పంత్ సిద్ధమవుతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, నెట్స్‌లో పంత్ ప్రాక్టీస్ ప్రారంభించడం గుడ్‍న్యూస్‍గా ఉంది.

భారత స్టార్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా.. పూర్తిగా కోలుకునే దశలో లాస్ట్ స్టేజ్‍లో ఉన్నట్టు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం బుమ్రా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తున్నాడని వెల్లడించింది. ఎన్‍సీఏ ప్రాక్టీస్ మ్యాచ్‍ల్లో బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడని తెలిపింది. ఆగస్టులో ఐర్లాండ్‍తో జరిగే టీ20 సిరీస్ నాటికి బుమ్రాను రెడీగా ఉంచాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ప్రాక్టీస్ గేమ్స్ ఆడుతున్నాడు.

టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారని బీసీసీఐ అప్‍డేట్ ఇచ్చింది. ప్రస్తుతం స్ట్రెన్త్, ఫిట్‍నెస్ డ్రిల్స్ చేస్తున్నారని పేర్కొంది. వారిద్దరూ గాయం నుంచి కోలుకుంటున్న ప్రక్రియ పట్ల బీసీసీఐ మెడికల్ టీమ్ సంతృప్తిగా ఉందని, రానున్న రోజుల్లో డ్రిల్స్ మరింత ఎక్కువగా చేయిస్తుందని బీసీసీఐ పేర్కొంది.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య భారత్ వేదికగా వన్డే ప్రపంకప్ జరగనుంది. పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమవటంతో భారత జట్టు కాంబినేషన్ కాస్త అనిశ్చితితో ఉంది. వన్డే ప్రపంచకప్‍నకు ఈ నలుగురు సిద్ధమైతే భారత జట్టు పూర్తి పటిష్టంగా ఉంటుంది. బీసీసీఐ కూడా అదే ఆశిస్తోంది. అయితే, అక్టోబర్‌లోగా పంత్ పూర్తి ఫిట్‍నెస్ సాధించే విషయంపై సందేహాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం