తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bhuvneshwar Kumar Set For A World Record: న్యూజిలాండ్‌ సిరీస్‌లో వరల్డ్‌ రికార్డ్‌పై కన్నేసిన భువీ

Bhuvneshwar Kumar set for a world record: న్యూజిలాండ్‌ సిరీస్‌లో వరల్డ్‌ రికార్డ్‌పై కన్నేసిన భువీ

Hari Prasad S HT Telugu

16 November 2022, 19:35 IST

google News
    • Bhuvneshwar Kumar set for a world record: న్యూజిలాండ్‌ సిరీస్‌లో వరల్డ్‌ రికార్డ్‌పై కన్నేశాడు టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. శుక్రవారం (నవంబర్‌ 18) నుంచి న్యూజిలాండ్‌తో ఇండియా మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
వరల్డ్ రికార్డుపై కన్నేసిన భువనేశ్వర్ కుమార్
వరల్డ్ రికార్డుపై కన్నేసిన భువనేశ్వర్ కుమార్ (HT_PRINT)

వరల్డ్ రికార్డుపై కన్నేసిన భువనేశ్వర్ కుమార్

Bhuvneshwar Kumar set for a world record: టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఓ పెద్ద వరల్డ్‌ రికార్డుపై కన్నేశాడు. టీ20ల్లో ఈ వరల్డ్‌ రికార్డుకు అతడు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం (నవంబర్‌ 18) నుంచి ప్రారంభం కాబోయే మూడు టీ20ల సిరీస్‌లోనే ఈ రికార్డు సాధించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

ఒక కేలండర్‌ ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి భువీ కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ జోషువా లిటిల్‌ ఉన్నాడు. అతడు 26 మ్యాచ్‌లలో 39 వికెట్లు తీసుకున్నాడు. లిటిల్‌ ఎకానమీ 7.58గా ఉంది. ఈ మధ్యే టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఓ హ్యాట్రిక్‌ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో ఈ లెఫ్టామ్‌ పేసర్‌ హ్యాట్రిక్‌ తీశాడు. ఇక భువనేశ్వర్‌ విషయానికి వస్తే అతడు లిటిల్‌ కంటే కేవలం 4 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ఈ ఏడాది భువనేశ్వర్‌ 30 మ్యాచ్‌లలో 36 వికెట్లు తీశాడు. మరో మూడు వికెట్లు తీస్తే లిటిల్‌ను సమం చేయనున్న భువీ.. 4 వికెట్లు తీస్తే వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంటాడు. భువీ ఎకానమీ రేటు కూడా ఏడుగా ఉంది.

ఈ మధ్య టీ20 వరల్డ్‌కప్‌లో భువీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతడు ఆరు మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే అతని ఎకానమీ రేటు మాత్రం 6.16గా ఉంది. టోర్నీలో ఇదే అత్యుత్తమ ఎకానమీ రేటు కావడం విశేషం. ఇక టీ20ల్లో 100 వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్‌ బౌలర్‌గా నిలవడానికి కూడా భువనేశ్వర్‌ 11 వికెట్ల దూరంలో ఉన్నాడు.

ప్రస్తుతం టీ20ల్లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ భువీనే. న్యూజిలాండ్‌తో తొలి టీ20 శుక్రవారం (నవంబర్‌ 18) వెల్లింగ్టన్‌లోని స్కై స్టేడియంలో జరగనుంది. ఈ మధ్యే ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ టీమ్స్‌ సెమీఫైనల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టాయి. ఇక ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మూడు టీ20ల సిరీస్‌లో పైచేయి కోసం చూస్తున్నాయి.

తదుపరి వ్యాసం