Pakistan vs New Zealand Highlights: ఫైనల్లో పాకిస్థాన్.. సెమీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌-pakistan vs new zealand highlights as pakistan in t20 world cup final after beating new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Vs New Zealand Highlights: ఫైనల్లో పాకిస్థాన్.. సెమీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌

Pakistan vs New Zealand Highlights: ఫైనల్లో పాకిస్థాన్.. సెమీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌

Hari Prasad S HT Telugu
Nov 09, 2022 04:58 PM IST

Pakistan vs New Zealand Highlights: టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరింది పాకిస్థాన్. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆ టీమ్‌.. ఆదివారం జరగబోయే ఫైనల్‌లో మరో వరల్డ్‌కప్‌పై కన్నేసింది. 13 ఏళ్ల తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ అడుగుపెట్టింది.

న్యూజిలాండ్ ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్థాన్
న్యూజిలాండ్ ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్థాన్ (AFP)

Pakistan vs New Zealand Highlights: అద్భుతం, అనూహ్యం.. సూపర్‌ 12 స్టేజ్‌ తొలి రెండు మ్యాచ్‌లు ఓడి కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్థాన్‌ ఇప్పుడు ఏకంగా ఫైనల్‌ చేరింది. అది కూడా సెమీస్‌లో పటిష్ఠమైన న్యూజిలాండ్‌ను చాలా సులువుగా చిత్తు చేసింది. ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌ అదరగొట్టిన పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది.

153 రన్స్‌ టార్గెట్‌ను మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు నష్టపోయి చేజ్‌ చేసింది. ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్‌ 43 బాల్స్‌లో 57, బాబర్‌ ఆజం 42 బాల్స్‌లో 53 రన్స్‌ చేశారు. ఈ విజయంతో పాకిస్థాన్‌ మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై ఉన్న ఆధిపత్యాన్ని ఆ టీమ్‌ కొనసాగించింది. 2007లో ఇండియా చేతుల్లో ఓడిన పాకిస్థాన్‌, 2009లో ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో ఆదివారం (నవంబర్‌ 13) జరగబోయే ఫైనల్లో పాకిస్థాన్‌ తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు కోరుకునే ఇండియా, పాకిస్థాన్‌ ఫైనల్‌ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.

అద్బుతంగా రాణించిన పాక్ బౌలర్లు

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. స్లో బాల్స్‌తో కివీస్‌ బ్యాటర్లను బోల్తా కొట్టించారు పాక్‌ బౌలర్లు. దీంతో కివీస్‌ టీమ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 రన్స్ మాత్రమే చేసింది.

డారిల్‌ మిచెల్‌ (53) హాఫ్‌ సెంచరీ చేశాడు. పాకిస్థాన్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది 4 ఓవర్లలో 24 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. తొలి బంతికే ఫోర్‌ కొట్టి ఫిన్‌ అలెన్‌ (4) మూడో బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కాసేపటికే మరో ఓపెనర్‌ డెవోన్‌ కాన్వే (21) కూడా రనౌటయ్యాడు. టాప్‌ ఫామ్‌లో ఉన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ (6) కూడా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ 49 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌ టీమ్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 68 రన్స్‌ జోడించారు. విలియమ్సన్‌ 42 బాల్స్‌లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 46 రన్స్‌ చేశాడు. అయితే డారిల్‌ మిచెల్‌ మాత్రం చివరి బంతి వరకూ క్రీజులో ఉన్నాడు. అతడు చివరికి 35 బాల్స్‌లో 53 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.

Whats_app_banner