Baichung Bhutia: ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రేసులో భూటియా
19 August 2022, 17:40 IST
- Baichung Bhutia: ఇండియన్ ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్ బైచుంగ్ భూటియా ఇప్పుడు ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నాడు. ఈ పోస్ట్ కోసం అతడు శుక్రవారం (ఆగస్ట్ 19) నామినేషన్ దాఖలు చేశాడు.
బైచుంగ్ భూటియా
న్యూఢిల్లీ: ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ఎన్నికలు ఈసారి రంజుగా సాగేలా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్ట్‌కు మాజీ ప్లేయర్ బైచుంగ్ భూటియా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. మాజీ ప్లేయర్, గతంలో భూటియా టీమ్ మేట్‌గా ఉన్న దీపక్ మొండల్ భూటియా పేరును ప్రతిపాదించాడు. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఉన్న ప్రముఖ ప్లేయర్ మధు కుమారి బలపరిచింది.
ఎమినెంట్ ప్లేయర్స్ ప్రతినిధిగా తాను నామినేషన్ దాఖలు చేసినట్లు ఈ సందర్భంగా భూటియా చెప్పాడు. ప్రెసిడెంట్ పదవి కోసం ప్లేయర్స్‌ను కూడా అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను కూడా ఆ అవకాశం కోసం చూస్తున్నట్లు తెలిపాడు. ప్లేయర్స్‌గానే కాదు అడ్మినిస్ట్రేటర్లుగా కూడా తాము బెస్ట్ అని నిరూపించుకుంటామని భూటియా అన్నాడు.
ఇక ఢిల్లీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షాజీ ప్రభాకరన్ కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అటు మరో మాజీ ప్లేయర్ యూజెనిసన్ లింగ్డో కూడా నామినేషన్ వేయబోతున్నాడు. ఇప్పటికే మేఘాలయ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న లింగ్డో అభ్యర్థిత్వాన్ని మమతా బెనర్జీ సోదరుడు అజిత్ బెనర్జీ బలపరుస్తుండటం గమనార్హం. శుక్రవారంతోనే నామినేషన్ల గడువు ముగిసింది.
ఈ నెల 28న ఏఐఎఫ్‌ఎప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో మూడో వ్యక్తుల ప్రమేయం ఉన్నదంటూ ఈ మధ్యే ఫిఫా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇండియాలో అండర్17 వుమెన్స్ వరల్డ్‌కప్ నిర్వహించే పరిస్థితి కూడా లేదని స్పష్టం చేసింది.
టాపిక్