FIFA Suspension: భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై ఫిఫా వేటు.. ఎందుకో తెలుసా?-fifa suspends all india football federation due to undue influence from third parties ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa Suspension: భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై ఫిఫా వేటు.. ఎందుకో తెలుసా?

FIFA Suspension: భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై ఫిఫా వేటు.. ఎందుకో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Aug 16, 2022 07:55 AM IST

అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసింది. బోర్డులో మూడో పక్షానికి చెందిన వ్యక్తుల జోక్యం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తక్షణమే ఈ వేటు అమలులోకి వస్తుందని పేర్కొంది.

<p>ఫిఫా</p>
ఫిఫా (AFP)

అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్యకు(AIFF) ఎదురు దెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) మంగళవారం నాడు భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరేషన్‌లో థర్డ్ పార్టీ వ్యక్తుల అనవసర జోక్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వెను వెంటనే ఈ నిషేధం అమలులోకి వస్తుందని ఫిఫా స్పష్టం చేసింది. ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లఘించిన కారణంగా ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఈ విషయంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

"ఫిఫా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించే థర్డ్ పార్టీల నుంచి అనవసర జోక్యం, ప్రభావం కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF)ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది" అని ఫిఫా బోర్డు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఫిఫా అత్యున్నత బాడీ ఆదేశం తర్వాతే సస్పెన్షన్‌ కూడా ఎత్తివేస్తామని కూడా తెలిపింది. తాజా నిర్ణయంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటీవ్ కమిటీ అధికారాలు కూడా రద్దు అయ్యాయని, సంస్థ రోజువారీ వ్యవహారాలపై ఏఐఎఫ్ఎఫ్ పాలకసంఘం తిరిగి పూర్తి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.

ఈ సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరగాల్సిన అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ కూడా సాధ్యపడట్లేదు. అక్టోబరు 11 నుంచి 30 మధ్య కాలంలో భారత్‌లో ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ప్రణాళికాబద్ధంగా ఇది నిర్వహించడం సాధ్యపడదు. త్వరలోనే వేరో ప్రదేశంలో ఈ టోర్నీ నిర్వహించే అవకాశముంది.

భారత క్రీడా మంత్రిత్వశాఖతో ఫిఫా నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతోందని, ఈ కేసుకు సంబంధించి సానుకూల ఫలితం వచ్చేందుకు ఇంకా అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఫిఫా తను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్