Jeff Thompson Advice to Bumrah: బుమ్రా కాస్త కన్నింగ్‌గా ఉండు.. వర్క్‌లోడ్‌పై ఆస్ట్రేలియా లెజెండ్ పేసర్ సలహా
04 February 2023, 20:44 IST
- Jeff Thompson Advice to Bumrah: జస్ప్రీత్ బుమ్రా గురించి ఆస్ట్రేలియా లెజెండ్ పేసర్ జెఫ్ థాంప్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు. బుమ్రా కాస్త కన్నింగ్‌గా ఆలోచించాలని స్పష్టం చేశారు. ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకోవాలని సలహా ఇచ్చారు.
బుమ్రా
Jeff Thompson Advice to Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలా రోజులే అవుతుంది. అతడు చివరగా సెప్టెంబరు 2022లో ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన అతడు ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌నకు కూడా దూరమయ్యాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు పునరాగమనం చేస్తాడని ఆశించినప్పటికీ ఫిట్నెస్ లేమితో ఇంకాస్త ఆలస్యం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు కూడా అతడు దూరమయ్యే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని, ఏ ఫార్మాట్ ఆడాలో నిర్ణయించుకోవాలని ఆసీస్ లెజెండ్ పెసర్ జెఫ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.
"బుమ్రా తాను ఏ ఫార్మాట్ ఆడాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవాలి. పరిమిత ఓవర్లలో కొనసాగుదామనుకుంటున్నాడా? లేక టెస్టు క్రికెట్‌లో ఆడాలనుకుంటున్నాడా? లేక రెండింటిలోనూ ఉండాలనుకుంటున్నాడా? అనేది నిర్ణయించుకోవాలి. టెస్టు మ్యాచ్‌లు ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డబ్బు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో ఏది బెటరో ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి. మా రోజుల్లో డబ్బు గురించి ఆలోచించే వాళ్లం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు అనే అంశమే లేదు. కానీ ఇప్పడంతా వ్యాపారమైంది. కాబట్టి ఆటగాళ్లు తమ గురించి తామే ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ ఫార్మాట్ ఆడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి." అని జెఫ్ థాంప్సన్ స్పష్టం చేశారు.
ఏ ఫార్మాట్‌లో ఆడాలనుకుంటున్నాడో ఆ విషయంలో బుమ్రా కాస్త కన్నింగ్‌గా ఆలోచించాలని జెఫ్ థాంప్సన్ అన్నారు. "ఈ రోజుల్లో ఆటగాళ్లు కాస్త కన్నింగ్‌గా ఆలోచించాలి. వర్క్ లోడ్ కారణంగా ఎందులో ఆడాలి? ఎందులో ఆడకూడదు? అనేది తెలుసుకోవాలి. మీరు మెరుగ్గా ఆడుతున్నట్లయితే మిమ్మల్నీ ఎలాగైనా ఎంచుకుంటారు. కాబట్టి ఆట విషయంలో నిర్ణయం మీరే తెలుసుకోవాలి." అని థాంప్సన్ తెలిపారు.
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్‌లో మాత్రం 2-1 తేడాతో గెలిచింది. అనంతరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.