Ashwin on Rohit: ధోనీ పేరు చెబుతూ రోహిత్, ద్రవిడ్‌లకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన అశ్విన్
23 June 2023, 9:28 IST
- Ashwin on Rohit: ధోనీ పేరు చెబుతూ రోహిత్, ద్రవిడ్‌లకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు అశ్విన్. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమిని మరోసారి గుర్తు చేస్తూ జట్టులోని ప్లేయర్స్ కు అభద్రతా భావం ఉండకూడదని చెప్పాడు.
ద్రవిడ్, రోహిత్, అశ్విన్, ధోనీ
Ashwin on Rohit: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ పేరు చెబుతూ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లకు పరోక్షంగా దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. జట్టులోని ప్లేయర్స్ కు అభద్రతాభావం లేకుండా ధోనీ ఏం చేశాడో అతడు చెప్పడం విశేషం. తన యూట్యూబ్ షోలో అశ్విన్ మాట్లాడాడు. యాషెస్ తొలి టెస్ట్ గెలిచిన ఆస్ట్రేలియాను అభినందిస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్ ను మరోసారి గుర్తు చేశాడు.
ఇండియా పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోవడానికి ధోనీ స్టైల్ ను ఫాలో కాకపోవడమే కారణమని కూడా అశ్విన్ పరోక్షంగా చెప్పాడు. ఫ్యాన్స్ బాధ తనకు అర్థమవుతోందని, అయితే ప్లేయర్స్ ను జట్టులో ఉంచడం, తీసేయడం వల్ల ట్రోఫీ గెలవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగానే ధోనీ గురించి అతడు ప్రస్తావించాడు.
"పదేళ్లుగా ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయిందన్న బాధను అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ బాధేంటో నాకు తెలుసు. కానీ వాళ్లు ఓ ప్లేయర్ ను తీసేయాలని, మరో ప్లేయర్ ను తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కానీ ఓ ప్లేయర్ క్వాలిటీ రాత్రికి రాత్రే మారిపోదు. మనం చాలా మంది ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుకుంటాం.
అతడు ఏం చేశాడు? చాలా సింపుల్. అతని కెప్టెన్సీలో నేను ఆడినప్పుడు ఓ 15 మందిని తీసుకునేవాడు. ఆ 15 మంది, తుది జట్టే ఆ ఏడాది మొత్తం ఆడేది. ఓ ప్లేయర్ కు అలాంటి భద్రత అనేది చాలా ముఖ్యం" అని అశ్విన్ అన్నాడు.
ప్లేయర్ అభద్రతాభావం గురించి రెండు వారాల్లో అశ్విన్ రెండోసారి మాట్లాడాడు. తాను అతిగా ఆలోచిస్తానని అందరూ అంటారని, కానీ అది సహజమే అని అశ్విన్ చెప్పాడు. "నేను అతిగా ఆలోచిస్తానని చాలా మంది నాపై ఓ ముద్ర వేశారు. ఓ ప్లేయర్ వరుసగా 15-20 మ్యాచ్ లు ఆడినప్పుడు అతడు మానసికంగా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
కానీ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడే అవకాశం వచ్చే ప్లేయర్ బాధపడటం, అతిగా ఆలోచించడం సహజం. అది నా పని. అది నా ప్రయాణం. ఇదే నాకు సూటవుతుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు 15 మ్యాచ్ లు వరసగా ఆడతావు.. నీ బాధ్యత ఇది.. నీకు కెప్టెన్సీ ఇస్తామంటే నేను అతిగా ఆలోచించను. అంతే కదా?" అని అశ్విన్ అన్నాడు.