MS Dhoni: “ధోనీని ఆ విషయం అడగం”: చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో-we dont ask dhoni about next ipl because says chennai super kings ceo kasi viswanath ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni: “ధోనీని ఆ విషయం అడగం”: చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

MS Dhoni: “ధోనీని ఆ విషయం అడగం”: చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 21, 2023 09:20 PM IST

MS Dhoni: వచ్చే సీజన్ ఐపీఎల్‍లో ఎంఎస్ ధోనీ ఆడడం గురించి సీఎస్‍కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ (PTI)

MS Dhoni: వచ్చే ఏడాది ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అన్న ప్రశ్న క్రికెట్ ప్రేమికుల్లో మెదులుతోంది. ఈ ఏడాది ఐపీఎల్‍ టైటిల్‍ను ధోనీ నేతృత్వంలోని సీఎస్‍కే కైవసం చేసుకుంది. మోకాలి నొప్పి తీవ్రంగా ఉన్నా సీజన్‍లో ఒక్క మ్యాచ్‍కు కూడా ధోనీ దూరం కాలేదు. ఒంటి కాలిపైనే కుంటుతూ జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. టీమ్‍ను విజేతగా నిలిపాడు. గత నెల ఐపీఎల్ సీజన్ అయిపోయిన తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో వచ్చే సంవత్సరం ఐపీఎల్‍లో ధోనీ ఆడడం గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడారు.

వచ్చే సీజన్ ఆడతావా లేదా అని తాము ధోనీని అడగబోమని, ఏం చేయాలో అతడికి బాగా తెలుసునని సీఎస్‍కే సీఈవో విశ్వనాథ్ అన్నారు. ఏం చేయాలన్న అతడే సొంతంగా తమకు చెబుతారని పేర్కొన్నారు. “ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో అతడికి (ధోనీ) తెలుసు. అందుకే ఏం చేస్తాం, ఎలా చేస్తావనే ప్రశ్నలను మేం అతడిని అడగం. సొంతంగా అతడే మాకు చెబుతాడు. ఏం చేయాలనుకున్న అతడు ముందుగా ఎన్.శ్రీనివాసన్‍కు చెబుతాడు. శ్రీనివాసన్‍తో ఏ విషయమైనా అతడు నేరుగా చెప్పేస్తాడు. మొదటి నుంచి ఇదే కొనసాగుతోంది” అని ఓ ఇంటర్వ్యూలో విశ్వనాథ్ అన్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‍లో కూడా నిర్ణయాన్ని పూర్తిగా తాము ధోనీకే వదిలేశామని సీఎస్‍కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు. అయితే, జట్టు పట్ల ధోనీకి ఎంతో అంకిత భావం ఉందని, గాయం ఉందంటూ అతడు ఎప్పుడూ సాకులు చెప్పలేదని అన్నారు. “ఆడాలనుకుంటున్నావా, విశ్రాంతి తీసుకుంటావా అని అతడిని మేం ఎప్పుడూ అడగలేదు. ఒకవేళ ఆడలేని పరిస్థితి ఉంటే నేరుగా తమకు చెప్పేవాడు. అయితే, ఆడడం అతడికి ఇబ్బందిగా ఉందని మాకు తెలుసు. కానీ జట్టు పట్ల, నాయకత్వం పట్ల అతడికి చాలా అంకితభావం ఉంది. అది జట్టుకు ఎంత ప్రయోజనమైందో అందరికీ తెలుసు. అతడిని అందరూ ప్రశంసించాలి” అని విశ్వనాథ్ అన్నారు.

మోకాలి శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడని విశ్వనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి వరకు అతడు మళ్లీ ప్రాక్టీస్ చేయబోడని వెల్లడించారు. రవీంద్ర జడేజా, ధోనీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సీఎస్‍కే సీఈవో స్పష్టం చేశారు.

కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచాక.. తన శరీరం సహకరిస్తే ఇంకో సీజన్ ఆడతానంటూ ధోనీ అన్నాడు. రిటైర్మెంట్ తీసుకునేందుకు ఇది బెస్ట్ టైమ్ అని, కానీ మరో సీజన్ ఆడాలని ఉందనేలా చెప్పాడు. అయితే, మరో ఎనిమిది నెలల వరకు ఈ విషయంపై ఏమీ చెప్పలేనని అన్నాడు.

Whats_app_banner